సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం

రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల్ని తెదేపా అధికారంలోకి వచ్చాక మరింత పెంచడంతో పాటు, వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.

Updated : 27 May 2023 06:05 IST

మహానాడు వేదికగా ప్రకటించనున్న తెదేపా

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాల్ని తెదేపా అధికారంలోకి వచ్చాక మరింత పెంచడంతో పాటు, వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఇదే విషయాన్ని శని, ఆదివారాల్లో జరిగే పార్టీ మహానాడులో ప్రకటించనుంది. వైకాపా ప్రభుత్వం సంక్షేమం ముసుగులో చేస్తున్న దారుణాలను మహానాడు వేదికగా ఎండగట్టాలని నిర్ణయించింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన తెదేపా ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఎప్పుడూ జరగలేదని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక దానికి ప్రాధాన్యమిస్తూ, సంక్షేమాన్ని రెట్టింపు చేస్తుందని మహానాడులో తెదేపా ప్రకటించనుంది. రాజమహేంద్రవరంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో.. మహానాడులో ప్రవేశపెట్టబోయే తీర్మానాలు, చేయబోయే ప్రకటనలపై సుదీర్ఘంగా చర్చించారు.

మాదిగలకు పెద్దపీట

బీసీలు, ఎస్సీల్లో మాదిగలు మొదటినుంచీ పార్టీకి అండగా ఉన్నారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వివిధ కారణాల వల్ల గత ఎన్నికల్లో ఆ రెండు వర్గాలు పార్టీకి కొంత దూరమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ వర్గాలను మళ్లీ పార్టీకి దగ్గర చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు. మాదిగలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సంఖ్యాబలాన్ని బట్టి మాలలకు సముచిత స్థానం కల్పిస్తూనే, మాదిగలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో వారికి పెద్దపీట వేయాలని, అదే సమయంలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్ణయించింది. బీసీలను పార్టీకి దగ్గర చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలకు తెదేపా పూర్తిస్థాయి మేనిఫెస్టోను దసరాకు విడుదల చేయనుంది. దానిలో ప్రస్తావించబోయే కొన్ని మౌలిక అంశాల్ని అధినేత చంద్రబాబు ఆదివారం జరిగే బహిరంగ సభలో ప్రకటిస్తారు.

రొటీన్‌కి భిన్నంగా ప్రసంగాలు

మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై చేసే ప్రసంగాలు ఈసారి రొటీన్‌కి భిన్నంగా ఉండేలా చూడాలని నిర్ణయించారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఆయా అంశాలపై వివిధ మాధ్యమాల్లో తమ వాణిని బలంగా వినిపిస్తున్న వారిని ఎంపిక చేసి మహానాడులో మాట్లాడిస్తారు.

స్థలాలను కేటాయించామన్న సాకుతో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి

మంగళగిరి నియోజకవర్గంలోని రైల్వే స్థలాలు, వాగు, రెవెన్యూ పోరంబోకు స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న ప్రజల్ని... రాజధానిలో సెంటు భూమి కేటాయించామన్న పేరుతో బలవంతంగా ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌.. పొలిట్‌బ్యూరో దృష్టికి తెచ్చారు. ఇళ్లు కట్టకుండానే, ఇప్పుడే నిరాశ్రయుల్ని చేయాలని చూస్తున్నారని తెలిపారు. ‘‘సీఆర్‌డీఏ చట్టంలో పేదల గృహనిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 5% భూమి కేటాయించింది. జగన్‌కు ఎన్నికలు వచ్చేసరికి రాజధాని ప్రాంతమే గొప్పగా కనిపించింది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే అక్కడ భూముల విలువ పెరుగుతుందని తెదేపా చెప్పిన విషయాన్నే... ఎకరం అక్కడ ఇప్పుడు రూ.10 కోట్లని చెప్పడం ద్వారా జగన్‌ నిర్ధారించారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

* లోకేశ్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండటంపై పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియజేసింది. శనివారం పార్టీ ప్రతినిధుల సభలో తెదేపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఎన్నిక నిర్వహణకు కమిటీని నియమిస్తూ పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది.


వివేకా హత్య కేసులో జగన్‌ పాత్రపై అనుమానాలు సీబీఐ అఫిడవిట్‌తో బలపడుతున్నాయి

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం జరిగిన వాదనలతో... వివేకా హత్యలో జగన్‌ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. వివేకా హత్యకు గురైన విషయం ఆ రోజు ఉదయం 6.15 గంటల కంటే ముందే జగన్‌కు తెలిసిందని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొనడం కీలక పరిణామమని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వివేకా హత్య కేసులో పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ‘‘ఆ రోజు వివేకాను హత్యచేసిన వ్యక్తులు నేరుగా అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. వెంటనే అవినాష్‌రెడ్డి.. జగన్‌ పీఏతోను, భారతి పీఏతోను మాట్లాడి, విషయం చెప్పారు. ఇవన్నీ ట్రాక్‌ చేస్తే వివేకా హత్యకేసులో జగనే నిందితుడని, రాజకీయ స్వార్థం కోసం సొంత చిన్నాన్నను చంపించారని అర్థమవుతోంది’’ అని పార్టీ నాయకులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో జగన్‌ పాత్ర లోకం ఎరిగిన సత్యమని, అదే విషయాన్ని ఇప్పుడు సీబీఐ చెప్పిందని అభిప్రాయపడ్డారు. ‘‘అంతఃపుర కుట్ర బయటపడుతుందనే ఇన్నాళ్లూ అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా చూసుకున్నారు. అందుకే ఇంతకాలం సీబీఐకి సహకరించకుండా పోలీసుల్ని అడ్డు పెట్టుకున్నారు. అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా చూసేందుకు వారు చేసిన ప్రయత్నం మరో డేరాబాబా ఎపిసోడ్‌ని తలపించింది. వివేకా హత్య గురించి ఉదయం 6.15 కంటే ముందే జగన్‌కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున... ఇప్పుడు ఆయన కూడా సీబీఐ ప్రశ్నించేందుకు ఆస్కారం ఉన్న వ్యక్తి’’ అని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని