ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు?

భారాస ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Updated : 27 May 2023 06:35 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

కరీంనగర్‌, ఈనాడు: భారాస ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్నివర్గాల ప్రజలు బాధతో ఉన్నారన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో పీవీ నరసింహారావు జయంతిని నిర్వహించిన కేసీఆర్‌ మళ్లీ ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఓడించాలనుకున్న వాళ్లే ఇప్పుడు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. స్పీకర్‌ తనకున్న విచక్షణాధికారంతో పార్లమెంటు కొత్త భవనాన్ని ఎవరు ప్రారంభించాలనేది నిర్ణయించారని చెప్పారు. గత మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ రాని కాంగ్రెస్‌ పార్టీ భారాసకు ప్రత్యామ్నాయమని కొన్ని మీడియా సంస్థలు భాజపాను అణగదొక్కాలని చూస్తున్నాయని సంజయ్‌ మండిపడ్డారు.

2018లో భాజపా ఒక్క స్థానంలోనే గెలిచినా.. తమ ఎమ్మెల్యే ఎటూ వెళ్లలేదని.. అదే కాంగ్రెస్‌లో 19 మంది గెలిస్తే నలుగురైదుగురు మినహా అందరు భారాసలో చేరారని.. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరన్నారు. ఆ పార్టీకి ఓటు వేస్తే భారాసకు వేసినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరు నేతలు భారాసతో పొత్తు విషయమై అనుకూలంగా మాట్లాడారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో ప్రజలు భాజపాకు అండగా నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని.. తనపై కొందరు చేసే ఆరోపణలు నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. గ్రానైట్‌ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆధారాలతో బయటపెట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ తనపై 18 మంది ఇంటెలిజెన్స్‌ పోలీసులతో నిఘా ఉంచి.. తన ఖాతాలన్నీ తనిఖీ చేయించారని.. ఎక్కడా ఏమీ దొరకలేదన్నారు. మద్యం కుంభకోణంలో కవిత అరెస్టుపై విలేకరులు ప్రశ్నించగా అవినీతి ఎవరు చేసినా.. పక్కాగా ఆధారాలుంటే ఈడీ అరెస్టు చేస్తుందని అన్నారు. శనివారం సాయంత్రం ఖమ్మంలో నిర్వహించే నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని