సంక్షిప్త వార్తలు (12)

ఒంగోలులో జరిగిన దళిత గర్జన సభలో చేసిన డిక్లరేషన్‌పై రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న తెదేపా మహానాడు సభల్లో తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఏపీ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య శనివారం లేఖ రాశారు.

Updated : 28 May 2023 06:56 IST

దళిత గర్జన డిక్లరేషన్‌పై తీర్మానించాలి

ఈనాడు-అమరావతి: ఒంగోలులో జరిగిన దళిత గర్జన సభలో చేసిన డిక్లరేషన్‌పై రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న తెదేపా మహానాడు సభల్లో తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఏపీ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య శనివారం లేఖ రాశారు. డిక్లరేషన్‌లోని పది అంశాలను లేఖలో ఆయన ప్రస్తావించారు.


రాష్ట్రపతిని అవమానించడం తగదు

సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి రామకృష్ణ

కడప (మారుతీనగర్‌), న్యూస్‌టుడే: నూతన పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేకుండానే ప్రారంభించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రపతిని అవమానించడం తగదని సూచించారు. కడపలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ బిల్లు పాస్‌ కావాలన్నా ముందుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రపతి స్థానానికి విలువ ఇవ్వకపోవడాన్ని క్షమించరాని నేరంగా భావించాలన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించలేని స్థితికి సీబీఐని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కర్నూలులో పాత్రికేయులపై వైకాపా నాయకులు దాడులు చేస్తే ప్రశ్నించే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.


వైకాపా నాయకులు పెత్తందారులు కాదా?

నెల్లూరులో జనసేన పార్టీ నిరసన

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ వైకాపా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌ అన్నారు. స్థానిక జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, గ్రావెల్‌, సిలికా అక్రమ మైనింగ్‌తో ప్రజాధనాన్ని దోచుకుంటున్న వైకాపా నాయకులు పెత్తందారులు కాదా అని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కుంటున్నవారిని ఏమంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాపం పసివాడు అంటూ ముఖ్యమంత్రి జగన్‌ పేరిట జనసేన నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా బాలాజీనగర్‌ పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మూడురోజుల్లో వైకాపా ఫ్లెక్సీలు తొలగించాలని లేదంటే వాటి పక్కనే తామూ ఏర్పాటు చేస్తామని జనసేన నాయకులు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న కేంద్రం

తొమ్మిదేళ్ల భాజపా పాలనపై కాంగ్రెస్‌ ధ్వజం

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. భాజపా తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకుని ‘నవ్‌ సాల్‌, నవ్‌ సవాల్‌’ ప్రతులను విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో శనివారం విడుదల చేసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి తొమ్మిది అంశాలపై ఆయన కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ‘నవ్‌ సవాల్‌’ ప్రతులను విడుదల చేస్తున్నామన్నారు. ‘గతంలో అదానీకి ఒక ఓడ రేవు మాత్రమే ఉండేది. నేడు ఏపీలో సహా ఆయనకు 14 ఓడరేవులు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు.


దళిత ఎమ్మెల్యేలకు అవమానం జరిగితే వైకాపా నేతలు స్పందించరా?

దారుణమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్య

జీడీనెల్లూరు: వైకాపా దళిత ఎమ్మెల్యేనైన తనతోపాటు పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొన్నిచోట్ల అవమానాలు జరిగితే వైకాపాలోని అగ్రవర్ణ నేతలు ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. వైకాపా దళిత ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు సామాజికవర్గం ఉన్న కొన్ని గ్రామాల్లో కావాలనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇళ్లకు తాళాలు వేసుకుని అవమానిస్తున్నారని వాపోయారు. దీన్ని ఖండించాల్సిన వైకాపా అగ్రవర్ణ నేతలు మిన్నకుండటం శోచనీయమన్నారు. వీరితోపాటు కలెక్టర్‌, ఎస్పీ సైతం స్పందించకపోవడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్పారు. వైకాపాలో ఏ వర్గం నేతలకైనా.. ఎక్కడైనా అవమానం జరిగితే, వైకాపా ఎస్సీ ఎమ్మెల్యేలు ఆ ఘటనను ఖండించడంలో.. ఎదుర్కోవడంలో ముందుంటే, అగ్రవర్ణాల నేతలు మాత్రం పట్టించుకోకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించారు.


ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో మోసం

జనసేన

గుంటూరు (బ్రాడీపేట), న్యూస్‌టుడే: రాజధాని ప్రాంతంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో పేద ప్రజలను పెద్ద మోసం చేశారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంత మంది అమాయకులకు ఆశ చూపించి చట్టబద్ధత లేని పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, నాయకులు రామచంద్రప్రసాద్‌, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


అమెరికాలో రాహుల్‌ సభకు సమన్వయకర్తగా రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా వచ్చే నెల 4న న్యూయార్క్‌లో ఏర్పాటు చేసే సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, మరో సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితలను సమన్వయకర్తలుగా ఏఐసీసీ నియమించింది. న్యూయార్క్‌లో సమావేశ మందిరం ఎంపిక, జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను వీరు సమన్వయం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం ఈ నెల 31న రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌ బయలుదేరి వెళ్లనున్నారు. వచ్చే నెల 7న హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్లు ఆయన ‘ఈనాడు’కు తెలిపారు.


సీఎంల గైర్హాజరు ప్రజా వ్యతిరేకం: భాజపా

దిల్లీ: అత్యంత కీలకమైన నీతి ఆయోగ్‌ సమావేశానికి ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు రాకపోవడాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా భాజపా అభివర్ణించింది. అది బాధ్యతారాహిత్యం కిందకే వస్తుందని విమర్శించింది. దేశ అభివృద్ధి విధానాలను రూపొందించేందుకు, రోడ్డు మ్యాప్‌ కోసం ఈ భేటీ జరిగిందని భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 100 అంశాలపై ఈ సమావేశం జరిగిందని, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాలేదని పేర్కొన్నారు. ‘ఇది దురదృష్టకరం. బాధ్యతారాహిత్యం, ప్రజా వ్యతిరేకం. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రం వాదనలను వినిపించే అవకాశం కోల్పోయారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ, కేసీఆర్‌ గిమ్మిక్కులు: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాల వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు గిమ్మిక్కులు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించని మోదీకి.. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉందంటే ఎవరైనా విశ్వసిస్తారా అని ప్రశ్నించారు. లిక్కర్‌ స్కాం గురించి కేసీఆర్‌తో చర్చించడానికే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హైదరాబాద్‌ వచ్చారని ఆరోపించారు.


రాహుల్‌ గాంధీలో గొప్ప మార్పు: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలో గొప్ప మార్పు కనిపిస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌ అన్నారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్ల భాజపా పాలనలో సమస్యలపై ఆయన గొంతెత్తి మాట్లాడుతున్నారన్నారు.


గాంధీభవన్‌లో నెహ్రూకు నేతల నివాళులు

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు శనివారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్‌, నాయకులు వీహెచ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, టి.కుమార్‌రావు, జి.నిరంజన్‌, మల్లు రవి, వినోద్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, మెట్టు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు సివిల్స్‌-2023 ప్రాథమిక పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్ష ఆదివారం జరగనుంది. తెలంగాణ నుంచి 50,646 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో హైదరాబాద్‌లోని 99 కేంద్రాల్లో 45,611 మంది, వరంగల్‌లోని 11 కేంద్రాల్లో 5,035 మంది పరీక్ష రాయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని