కౌరవ సేనను మట్టి కరిపిద్దాం

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని.. వైకాపా కౌరవ సేనను ఓడిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. పేదవాడికి సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి తమ విధానమని ప్రకటించారు.

Published : 28 May 2023 06:35 IST

వచ్చేది కురుక్షేత్ర సమరం.. వైకాపాను ఓడిద్దాం
పేదవాడికి సంక్షేమం.. రాష్ట్రానికి అభివృద్ధి
ఆ రెండింటి మేళవింపుతోనే ఎన్నికల ప్రణాళిక
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా సిద్ధం
మహానాడు ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు

రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ ప్రభుత్వం నడుస్తోంది. సీ అంటే కరప్షన్‌ (అవినీతి), ఐ అంటే ఇన్‌ఎఫిషియెన్సీ (అసమర్థ్ధత), డీ అంటే డిస్ట్రక్షన్‌ (విధ్వంసం).

తెదేపా ఎన్నికల గుర్తు సైకిల్‌ సామాన్యుడి వాహనం. ముందు చక్రం సంక్షేమానికి, వెనుక చక్రం అభివృద్ధికి ప్రతీకలు. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ సైకిల్‌ వచ్చింది ఇక దూసుకుపోవటమే.

తానొక్కడే ధనవంతుడిగా ఉండాలి, మిగతావారంతా పేదరికంలోనే మగ్గిపోవాలన్నది జగన్‌ తీరు. ప్రజలందరూ ధనికులు కావాలనేది నా సంకల్పం. రాష్ట్రంలో ప్రతి పేదవాణ్ని ధనికుడిగా మార్చే బాధ్యత మాది.

మహానాడులో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

మహానాడు ప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని.. వైకాపా కౌరవ సేనను ఓడిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. పేదవాడికి సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి తమ విధానమని ప్రకటించారు. సంపద సృష్టించటమూ, దాన్ని పేదలకు పంచటమూ రెండూ తమకు తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బీజం వేసిందే తెదేపా అని చెప్పారు. ప్రజలు మెచ్చేలా, భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా.. మరింత సంక్షేమం, అభివృద్ధి (సంక్షేమం, అభివృద్ధి ప్లస్‌) చేసి చూపిస్తామని వెల్లడించారు. ఈ రెండింటి మేళవింపుతో ఆదివారం జరగబోయే బహిరంగ సభలో తొలి ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది అదిరిపోతుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు వేమగిరి వద్ద మహానాడును శనివారం ఉదయం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. సంపద సృష్టించటం తెదేపాకు కొత్తేమీ కాదని.. నష్టపోయిన రాష్ట్రాన్ని రాబోయే అయిదేళ్లలో గట్టెక్కించే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపు కరతాళ ధ్వనులు, నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. చంద్రబాబు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..!

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ పోరాడాలి.ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని  ప్రజలంతా ముక్తకంఠంతో పలకాలి. వైకాపా కౌరవ సేనను ఓడిద్దాం. గౌరవసభగా మార్చి అసెంబ్లీలో అడుగుపెడదాం. 2024లో లేదా అంతకంటే ముందే ఎన్నికలొచ్చినా మనం సిద్ధం. మీ పరిధిలో మీరు కష్టపడి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఆ రాయిని తెదేపా వలతో అడ్డుకుందాం. జనాల్ని కొడుతున్న అతణ్ని ఆ రాయితోనే చితకబాదుదాం. 

రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ ప్రభుత్వం నడుస్తోంది. సీ అంటే కరప్షన్‌ (అవినీతి), ఐ అంటే ఇన్‌ఎఫిషియెన్సీ (అసమర్ధత), డీ అంటే డిస్ట్రక్షన్‌ (విధ్వంసం) ప్రభుత్వం నడుస్తోంది. అమరావతికి తెదేపా రూపమిస్తే దాన్ని నాశనం చేసి.. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయి. కొత్త పెట్టుబడులు రావట్లేదు. జగన్‌ చెప్పిన జాబ్‌ క్యాలెండర్‌ మాటే లేదు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌.. ఇప్పుడు కేంద్రం ముందు సాష్టాంగ పడుతున్నారు. అమ్మఒడి పథకం అబద్ధం. నాన్న బుడ్డి పథకం వాస్తవం. దశలవారీ మద్య నిషేధమని హామీ ఇచ్చి.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులు చెప్పాలంటే మహానాడు సరిపోదు.

కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్‌

మాచర్లలో చంద్రయ్య అనే తెదేపా కార్యకర్తను చంపుతూ... జై జగన్‌ అంటే వదిలేస్తామని వైకాపా నాయకులు బెదిరించగా.. జై తెలుగుదేశం అని నినదిస్తూ ప్రాణాలొదిలాడే కానీ కానీ జై జగన్‌ అనలేదు. గత నాలుగేళ్లలో ఇలా ఎంతో మంది తెదేపా కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడలేదు. వారి త్యాగాలకు సెల్యూట్‌ చేస్తున్నా. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎన్టీఆర్‌ శతజయంతి సాక్షిగా మహానాడులో చెబుతున్నా.. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటా. 42 ఏళ్లుగా కష్టపడుతున్న మీ రుణం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తీర్చుకుంటా. మిమ్మల్ని బలోపేతం చేసి శక్తిమంతమైన నాయకులుగా తీర్చిదిద్దుతా.

ఏ స్కీము ప్రవేశపెట్టినా.. స్కామే

జగన్‌ ఏ స్కీమ్‌ ప్రవేశపెట్టినా అందులో ఓ స్కామ్‌ ఉంటుంది. ఆయన స్కామ్‌ల్లో మాస్టర్‌ మైండ్‌. జగన్‌ ఒక సైకో. అబద్ధాల పుట్ట. కోడికత్తి దాడి పేరిట నాటకాలాడారు. వివేకా హత్య ఘటనలో ఆడిన నాటకాలన్నీ ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఇసుక, మద్యం, భూములు, ఖనిజ సంపద ఇలా దొరికినదల్లా మింగేసి.. రూ.2.27 లక్షల కోట్లు దోచుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అధికంగా ఏపీలో ధరలు పెరిగిపోయాయి. రూ.6 వేల కోట్ల విలువైన ఆస్తులను అమూల్‌కు ధారాదత్తం చేసిన అమూల్‌ బేబీ జగన్‌.

జనమంతా ధనికులు కావాలనేది నా సంకల్పం

తానొక్కడే ధనవంతుడిగా ఉండాలి, మిగతావారంతా పేదరికంలోనే మగ్గిపోవాలన్నది జగన్‌ తీరు. ప్రజలందరూ ధనికులు కావాలనేది నా సంకల్పం. రాష్ట్రంలో ప్రతి పేదవాణ్ని ధనికుడిగా మార్చే బాధ్యత మాది. దీని కోసం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీ4)తో కొత్త విధానాన్ని అమలు చేస్తాం. నిరంతరం సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచి వారిని ధనికుల్ని చేస్తాం. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.508 కోట్లు కాగా.. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తి విలువే రూ.510 కోట్లు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అతి తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంది. అంటే పేద రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి జగన్‌.

సీతను అపహరించటానికి సాధువు వేషంలో వచ్చిన రావణుడిలా

రావణాసురుడు సాధువు వేషంలో వెళ్లి సీతను లక్ష్మణరేఖ దాటేలా చేసి ఆమెను  అపహరించినట్లుగా... ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నారు. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో గత నాలుగు నెలల్లో జరిగిన ఘటనల్లో వారానికి ఓ ఘటనను తీసుకుని పరిశీలిస్తే జగన్‌ ప్రభుత్వ తీరు బయటపడుతుంది. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్లు అప్పుల పాల్జేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 35 శాతం. నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. తిరుమలను గంజాయికి కేంద్రంగా మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.

పింఛను ప్రవేశపెట్టింది.. రూ.2 వేలు చేసింది తెదేపానే

నెలకు రూ.35 పింఛనుతో సామాజిక భద్రత పింఛన్ల పథకానికి శ్రీకారం చుట్టిందే ఎన్టీఆర్‌. దాన్ని రూ.2 వేలకు పెంచిన ఘనత తెదేపాదే. రూ.2కే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, సగం ధరకే విద్యుత్తు వంటి వందల సంక్షేమ పథకాలను తెదేపా ప్రజలకు అందించింది.  ఇప్పుడు మరింత సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాం. 2014లో తెదేపా అధికారం చేపట్టాక.. 2029 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. వ్యవసాయంలో 11 శాతం వృద్ధిరేటు సాధించాం. సాగునీటి ప్రాజెక్టులపై రూ.64 వేల కోట్లు ఖర్చు చేశాం. రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఆ పెట్టుబడులు వచ్చుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు లభించేవి. 2019లో ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.  
* నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర చాలా బాగా జరుగుతోంది.
* తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్‌కు మనం వారసులం. ఎన్టీఆర్‌ శతజయంతితో పాటు, 42 ఏళ్ల తెదేపా ప్రయాణాన్ని పురస్కరించుకుని తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడదామని సంకల్పం తీసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలను దేశంలో 1, 2 స్థానాల్లో నిలపాలనేది నా ఆశయం.
* రాజమహేంద్రవరం ఎన్టీఆర్‌ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక. నన్నయ ఇక్కడే నడయాడారు. కందుకూరి వీరేశలింగం ఇక్కడే పుట్టారు. కాటన్‌ ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు రాజమహేంద్రవరం వైపే ఉంది. అన్ని రోడ్లూ ఇటువైపే దారితీస్తున్నాయి.
* మన తెదేపా యాప్‌ను లక్ష మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ చెప్పేది నేరుగా క్షేత్రస్థాయికి చేరుతోంది.


తెదేపా జాతీయ అధ్యక్షుడిగా 14వ సారి చంద్రబాబు ఎన్నిక

తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వరుసగా 14వ సారి ఎన్నికయ్యారు. మహానాడులో శనివారం తెదేపా అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. ఎన్నిక వివరాలను ఎన్నికల నిర్వహణ కమిటీ తరఫున కాలవ శ్రీనివాసులు రాత్రి ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 నామినేషన్లు... అవి కూడా చంద్రబాబును బలపరుస్తూ వచ్చాయని తెలిపారు. అందువల్ల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీనివాసులు ప్రకటించారు. తర్వాత ఎన్నికల కమిటీ తరఫున డిక్లరేషన్‌ పత్రాన్ని చంద్రబాబుకు అప్పగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు