ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్ల అవినీతి

ప్రాజెక్టుల పేరుతో భారాస ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

Published : 28 May 2023 06:34 IST

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ

నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, న్యూస్‌టుడే: ప్రాజెక్టుల పేరుతో భారాస ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో కొనసాగిన పీపుల్స్‌ మార్చ్‌లో భాగంగా ఆయన ‘పాలమూరు’ పథకం పనులను పరిశీలించారు. వట్టెం శివారులోని వెంకటాద్రి జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోయిన పలువురు మహిళా రైతులు భట్టి విక్రమార్క వద్దకు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. భూములు అందజేస్తే ఇంటికో ఉద్యోగం, భూమికి భూమి ఇస్తామని ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాలమూరు’ ఎత్తిపోతల డబ్బులు స్వాహా చేయడం మినహా ప్రజలకు నీరు ఇవ్వాలన్న ఆలోచనే భారాస ప్రభుత్వానికి లేదన్నారు. భారీ నీటిపారుదల శాఖకు నాలుగేళ్లుగా మంత్రే లేరని, పదేళ్లుగా ఈఎన్‌సీని నియమించకుండా విశ్రాంత ఈఎన్‌సీనే కొనసాగిస్తుండటంతో ఆంతర్యం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వట్టెం జలాశయం కట్టకు మట్టి తరలింపు పెద్ద కుంభకోణం అని, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కాదని, మట్టి జనార్దన్‌రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్‌ నుంచి భారాసలో చేరిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి ప్రభుత్వం రూ.6 లక్షల పాత బిల్లుకు రూ.26 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని