కర్ణాటకలో కొలువుదీరిన పూర్తిస్థాయి మంత్రివర్గం

కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ 24 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

Published : 28 May 2023 04:32 IST

ఒక మహిళకే అవకాశం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ 24 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 20న ్ఞసీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో సహా 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 34 మంది మంత్రుల్లో ఒక్కరే మహిళ ఉండటం గమనార్హం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌లతో పలు దఫాలు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి.. వారి సూచనల మేరకు మంత్రి పదవులను కేటాయించారు. ఒక్కలిగ, లింగాయత, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల వారికి ఈసారి ప్రాధాన్యం లభించింది. విధాన పరిషత్తులో విపక్ష నేత బి.కె.హరిప్రసాద్‌తో పాటు మాజీ మంత్రులు ఆర్‌.వి.దేశ్‌పాండే, టి.బి.జయచంద్ర తదితరులకు మంత్రి పదవులు దక్కలేదు.  ప్రస్తుతం 34 మంది మంత్రులకు శాఖలు కేటాయించే కసరత్తు మొదలైంది.


తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శికి మంత్రివర్గంలో చోటు

మాన్వి, న్యూస్‌టుడే: తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న ఎన్‌.ఎస్‌.బోస్‌రాజు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా అధిష్ఠానం కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈయన కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నడింపల్లి సుభాష్‌ చంద్ర బోసురాజు పూర్తిపేరు. నాటి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లులో జన్మించిన ఆయన.. కొన్నాళ్ల కిందట వ్యవసాయం నిమిత్తం కర్ణాటకలోని రాయచూరు తాలూకా జీనూరు క్యాంపునకు వచ్చేశారు. ఇక్కడే వ్యవసాయంతో పాటు ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో యూత్‌ కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. బంగారప్ప, వీరప్ప మొయిలీల హయాంలో కీలక పదవులు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని