వైకాపా పెద్దల భూములా.. విలువలు పెంచెయ్‌!

రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్‌ విలువలను జూన్‌ ఒకటి నుంచి పెంచేందుకు ప్రత్యేక సవరణ(స్పెషల్‌ రివిజన్‌) పేరుతో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు వైకాపాలోని కొందరు పెద్దలకు మేలు చేయనుంది.

Updated : 28 May 2023 08:10 IST

విశాఖలో అంతా వ్యూహాత్మకం
అధికారపక్ష నేతల ప్రాజెక్టులున్న చోట ఎత్తుగడ

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్‌ విలువలను జూన్‌ ఒకటి నుంచి పెంచేందుకు ప్రత్యేక సవరణ(స్పెషల్‌ రివిజన్‌) పేరుతో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు వైకాపాలోని కొందరు పెద్దలకు మేలు చేయనుంది. వీరు మున్ముందు భూములు కొనే అవకాశం ఉన్న చోట పెంచకుండా.. ప్రస్తుతం స్థలాలున్న చోట విలువ పెరిగేలా వ్యవహారాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన.. అభ్యంతరాల స్వీకరణ దశ దాటి ఆమోదముద్ర పడితే వారి ఆస్తుల విలువ అమాంతం భారీగా పెరగనుంది. విశాఖలో మార్కెట్‌ విలువ రెట్టింపు చేసేందుకు ప్రతిపాదించిన ప్రాంతాలకు సమీపంలోనే వైకాపా పెద్దల భాగస్వామ్యంతో జరుగుతున్న భారీ హౌసింగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్నిచోట్ల చదరపు గజం రూ.25 వేలుంటే.. రూ.40 వేలకు, మరికొన్ని చోట్ల రూ.28 వేల నుంచి రూ.50 వేలకు పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. అనుకున్నట్లే జరిగితే పెంపును ఆధారంగా చేసుకొని ప్రస్తుతం నిర్మాణ దశల్లోని ప్రాజెక్టులను మరింత అధిక ధరలకు విక్రయిస్తారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం చేతికిచ్చినట్టే.

ఆ మార్గంలో: విశాఖలోని మధురవాడ ప్రాంతంలో జాతీయ రహదారి-16 నుంచి న్యాయ కళాశాల మీదుగా రుషికొండ వరకు ఉన్న మార్గంలో మార్కెట్‌ విలువ భారీగా పెంచేందుకు ప్రతిపాదించారు. ఈ రోడ్డులోనే వైకాపా కీలక నాయకుల కుటుంబ సభ్యులు, వారి సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. పలు బహుళ అంతస్తులు, విల్లాల ప్రాజెక్టు ఉన్నాయి. రుషికొండ సమీపంలో 50 ఎకరాల్లో వైకాపా కీలక నేత బంధువు ఓ ప్రాజెక్టు చేపడుతున్నారు. గతంలో వుడా నుంచి కొనుగోలు చేసిన 2.30 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండడంతో దానికి ప్రత్యామ్నాయంగా కేటాయించేందుకు ఉద్దేశించిన స్థలం విలువ కూడా అమాంతం పెరగనుంది. గతంలో ఇక్కడ చ.గజం రూ.27 వేలు ఉంటే... తాజాగా రూ.50 వేలకు ప్రతిపాదించారు. ఇక్కడ విలువలు భారీగా పెంచేందుకు పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం.
కొంటారనే పెంచలేదా?: భీమిలి మండలం కాపులుప్పాడ ప్రాంతంలో స్థలాలకు డిమాండ్‌ ఎక్కువ. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే పరిపాలన కేంద్రమైన కోర్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతానికి ఇది అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ జరిగే క్రయవిక్రయాలే భీమిలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆదాయానికి కీలకం. ప్రస్తుత ప్రత్యేక సవరణలో ఇక్కడ మార్కెట్‌ విలువ పెంచకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు భవిష్యత్తులో ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయనుండడంతో ధరలు పెంచడం లేదన్న వాదన వినిపిస్తోంది.


అదీ... సంగతి

జాతీయ రహదారులు, ఇతర రహదారుల పక్కనున్న భూముల విలువ పెంచడానికి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుత సవరణలో అలాంటి ఆలోచనను కొన్నిచోట్ల పక్కన పెట్టేశారు. అది కూడా వ్యూహాత్మకంగానే అని తెలుస్తోంది.  భీమిలి నుంచి భోగాపురం వరకు నిర్మించ తలపెట్టిన ఆరువరుసల ‘గ్రీన్‌ఫీల్డ్‌’ రహదారి సమీపంలో ఈసారి భూముల విలువ పెరగొచ్చని అంతా భావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో భూమి సేకరించాల్సి ఉంది. భీమిలి పరిధిలోని ధరల పెంపునకు అవకాశం ఉన్న గ్రామాలన్నీ ఆరువరుసల మార్గం పక్కనే ఉన్నాయి. ఇక్కడ ధరలు పెంచితే మారిన విలువల ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలనే డిమాండు రైతుల నుంచి రావొచ్చని ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకే సుమారు ఆరు గ్రామాల్లో భూముల ధరలు పెంచలేదు. పెందుర్తి, గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రహదారుల విస్తరణ జరగనున్న ప్రాంతాల్లోనూ పెంపుపై ప్రతిపాదనలు చేయలేదు. విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోనూ కొన్నిచోట్ల పెంచలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని