రూ.2 వేల నోట్లను రూ.500 నోట్లుగా మారుస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు నియోజకవర్గానికి రూ.25-30 కోట్ల నగదును వైకాపా నేతలు ఇప్పటికే తరలించారని.. రూ.2వేల నోట్లు రద్దుకావడంతో వాటన్నింటినీ రూ.500 నోట్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 28 May 2023 04:32 IST

ప్రజాధనాన్ని దోచే వ్యక్తుల విషయంలో చండశాసనుడినవుతా
తెదేపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి సందేశంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు నియోజకవర్గానికి రూ.25-30 కోట్ల నగదును వైకాపా నేతలు ఇప్పటికే తరలించారని.. రూ.2వేల నోట్లు రద్దుకావడంతో వాటన్నింటినీ రూ.500 నోట్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడులో శనివారం ఆయన తెదేపా జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై.. ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తొలి సందేశం ఇచ్చారు. ప్రజాధనాన్ని దోచే వ్యక్తుల విషయంలో చండశాసనుడిలా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సహజవనరుల్ని ఇష్టానుసారంగా దోచేస్తున్న అధికారపార్టీ నేతలు.. వాటి ద్వారా వచ్చే సొమ్మును విదేశాలకు పంపడంతో పాటు బంకర్లలోనూ దాస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ విధ్వంస పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గింది

జగన్‌ విధ్వంస పాలనలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిందని, పేదలను నిరుపేదలను చేసి... సీఎం దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘హైదరాబాద్‌లో ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయం ఉందంటే దానికి పునాది వేసింది తెదేపానే. 2018-19లో ఏపీ ఆదాయం రూ.66,786 కోట్లు. తెలంగాణ ఆదాయం రూ.69,620 కోట్లు. 2022-23లో ఏపీ ఆదాయం రూ.94,916 కోట్లకు పెరగ్గా... తెలంగాణ ఆదాయం రూ.1,32,176 కోట్లకు చేరింది. అనుభవం లేని తుగ్లక్‌ పరిపాలన వల్లే ఇదంతా. 2014లో రూ.16వేల కోట్లు లోటుబడ్జెట్‌ ఉన్నా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచాం. తెలంగాణ ఆదాయంతో ఏపీ ఆదాయాన్ని సమానం చేసేందుకు రాత్రింబవళ్లూ శ్రమించాం’ అని చంద్రబాబు చెప్పారు.

తెలంగాణకు వెళ్లిపోతున్నారు..

‘చదువుకునే పిల్లలు ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లిపోతున్నారు. మొన్నటి తెలంగాణ ఎంసెట్‌లో మొదటి 10 మందిలో ఏడుగురు ఏపీవారే. ఈ నాలుగేళ్లలో ఏం నష్టపోయామో ప్రజలకు చెప్పే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి. తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను పార్టీ తీసుకుంటుంది. పేదలను ధనికుల్ని చేసే పీ4 ఫార్ములాను అందరూ ఆమోదించాలి’ అని చంద్రబాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని