పేదోళ్లను ధనికులను చేస్తా..

‘నాలుగేళ్ల జగన్‌ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. సీబీఐ ఛార్జిషీటు వేసిన మొత్తమే రూ.43వేల కోట్లు. ఎమ్మెల్యేల దోపిడీ అదనం. ఇదంతా కక్కిస్తాం.

Published : 28 May 2023 04:32 IST

జగన్‌ పాలనలో రూ.2.5 లక్షల కోట్ల దోపిడీ
ఎవడు అడ్డమొచ్చినా సైకిల్‌తో తొక్కుకొని పోతాం
దోపిడీ దొంగల్లారా.. ఖబడ్దార్‌.. మీ గుండెల్లో నిద్రపోతాం
విరుచుకుపడిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
(రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

‘నాలుగేళ్ల జగన్‌ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. సీబీఐ ఛార్జిషీటు వేసిన మొత్తమే రూ.43వేల కోట్లు. ఎమ్మెల్యేల దోపిడీ అదనం. ఇదంతా కక్కిస్తాం. అవసరమైన విచారణలు వేయించి, తిన్న ప్రతిపైసా.. పేదవాడికి ఇచ్చే బాధ్యత తెదేపాది. పేదోళ్లను ధనికులను చేసి చూపిస్తా. ఇది పేదలు, పెత్తందారుల యుద్ధం కాదు. పేదలను ధనికులు చేసే (పూర్‌ టు రిచ్‌) యుద్ధం. ఇదే తెదేపా సంకల్పం. రాజమహేంద్రవరం నుంచి ఈరోజే ప్రారంభిస్తున్నాం. ఎవడు అడ్డొచ్చినా సైకిల్‌తో తొక్కుకొని పోతాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు వేమగిరి వద్ద శనివారం ప్రారంభమైన తెదేపా మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ‘సహజవనరుల దోపిడీ- ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌, డ్రగ్స్‌, గంజా, రెడ్‌శాండల్‌ మాఫియా’ తీర్మానాన్ని ఆమోదించే ముందు చంద్రబాబు మాట్లాడారు. ‘తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్‌ సంపాదించిన రూ.43 వేల కోట్లు స్వాధీనం చేసుకుంటే, బూత్‌కొకరు కోటీశ్వరుడు అవుతారు. సీఎంగా దోచుకున్న రూ.2.5 లక్షల కోట్లు ఇస్తే రాష్ట్రంలో ఎంతమంది కోటీశ్వరులు అవుతారో? ఈ కొత్త బిచ్చగాడు తాజాగా క్యాస్ట్‌వార్‌ అంటున్నాడు. అది క్యాష్‌ వార్‌. దోపిడీ దొంగల్లారా ఖబడ్దార్‌. మీ గుండెల్లో నిద్రపోతాం’ అని హెచ్చరించారు.

మహిళా శక్తిని గుర్తించింది తెదేపాయే

రాష్ట్రంలోని మహిళలను మహాశక్తిగా తయారుచేసే కార్యక్రమాన్ని రూపొందించనున్నామని  చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళా శక్తిని గుర్తించింది.. నాయకత్వాన్ని పెంచింది తెదేపాయేనని తెలిపారు. ‘మహిళా సంక్షేమంలో కోతలు- అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు’ అంశంపై చేసిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆదివారం నిర్వహించే ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో మహిళలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

వెనుకబడిన వర్గాల రక్షణకు ప్రత్యేక చట్టం

‘వెనుకబడిన వర్గాల రక్షణకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యతను తెదేపా తీసుకుంటుంది’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘తెదేపా హయాంలోని అయిదేళ్లలో బీసీలకు ఎంత ఖర్చు పెట్టాం? ఇప్పుడు నాలుగేళ్లలో వైకాపా ఎంత ఖర్చు పెట్టిందనే దానిపై కులాలవారీగా చర్చించేందుకు తెదేపా సిద్ధం’ అని సవాలు చేశారు. ‘బీసీల ద్రోహి జగన్‌ రెడి’్డ అనే తీర్మానాన్ని మహానాడులో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టగా తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు.

ముస్లింల ఆస్తుల పరిరక్షణకు..

‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగేలా చూసే బాధ్యత తెదేపా తీసుకుంటుంది’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. మైనారిటీల సంక్షేమంపై మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ... ‘ముస్లిం సంస్థల ఆస్తులపై దాడులు జరక్కుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. వక్ఫ్‌బోర్డు ఆస్తులను సంరక్షించి, ఆదాయం పెరిగేలా చేస్తాం. పెరిగిన ఆదాయాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగిస్తాం’ అని హామీ ఇచ్చారు.

రాబోయే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు

రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహానాడులో ‘యువత సంక్షేమం.. యువగళం’పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించి మాట్లాడారు. ‘రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు రావాలంటే తెదేపాతోనే సాధ్యం. తెదేపాకు మద్దతుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యువత ముందుకు రావాలి. ఏపీ, తెలంగాణల్లోని యువతను గ్లోబల్‌ ఎకానమీకి అనుసంధానిస్తాం. ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని యువతను శక్తిమంతంగా తయారు చేస్తాం’ అని చెప్పారు.

ఆదివాసీలకు ప్రత్యేక కార్యక్రమం

ఆదివాసీలకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం, ఎస్టీల ద్రోహి జగన్‌ రెడ్డి అనే తీర్మానాన్ని మహానాడులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ప్రవేశపెట్టారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ..‘మొన్న ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ అతన్నే(జగన్‌ను ఉద్దేశించి) గెలిపించారు. తర్వాత ఆ సైకో గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’ అని విమర్శించారు.


తెదేపా జాతీయ అధ్యక్షుడిగా 14వ సారి చంద్రబాబు ఎన్నిక

తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వరుసగా 14వ సారి ఎన్నికయ్యారు. మహానాడులో శనివారం తెదేపా అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. వివరాలను ఎన్నికల నిర్వహణ కమిటీ తరఫున కాలవ శ్రీనివాసులు రాత్రి ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 నామినేషన్లు... అవి కూడా చంద్రబాబును బలపరుస్తూ వచ్చాయని తెలిపారు. అందువల్ల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీనివాసులు ప్రకటించారు. తర్వాత ఎన్నికల కమిటీ తరఫున డిక్లరేషన్‌ పత్రాన్ని చంద్రబాబుకు అప్పగించారు.

రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా

‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా రాగద్వేషాలకు తావులేకుండా, కులమత ప్రాంతీయతలకు అతీతంగా.. నాకు అప్పగించిన విధులను మనసా వాచా కర్మణా నీతిమంతంగా, సమర్థంగా నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెదేపా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రజల అభీష్టం మేరకు శాయశక్తులా కృషిచేస్తానని, పార్టీ పటిష్ఠత పెంచడానికి, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతికి.. విజ్ఞానవంతమైన, ఆదర్శవంతమైన, సంతోషకరమైన, ఆర్థిక అసమానతలు లేని, సుసంపన్నమైన సమాజ స్థాపనకు వెనకబడిన ప్రాంతాల, రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని