భాజపా అధికారంలోకి వస్తేనే యువతకు కొలువులు

మద్యం దందాలో లెక్కలు తేల్చుకునేందుకే దిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశానికి ఆప్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ డుమ్మా కొట్టి.. కేసీఆర్‌ దగ్గరికి వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

Updated : 28 May 2023 06:40 IST

ఖమ్మం నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌

ఈటీవీ- ఖమ్మం: మద్యం దందాలో లెక్కలు తేల్చుకునేందుకే దిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశానికి ఆప్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ డుమ్మా కొట్టి.. కేసీఆర్‌ దగ్గరికి వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఖమ్మంలో భాజపా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తేనే యువతకు కొలువులు దక్కుతాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 34 నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఒక్క పరీక్ష కూడా సక్రమంగా జరగలేదన్నారు. అయిదు నెలల్లో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పారు. జంబో డీఎస్సీ నిర్వహించి 25 వేల ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ఉచిత వైద్యం, విద్య అందిస్తామని చెప్పారు.

2018 శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో భాజపాకు ఓట్ల శాతం 7 నుంచి 30కి పెరగగా.. కాంగ్రెస్‌ ఓట్ల శాతం 29 నుంచి 19కి పడిపోయిందన్నారు. భారాస ఓట్ల శాతం 40 నుంచి 30కి తగ్గిందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు తోకపార్టీలుగా మారాయన్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఒకరు, ఎమ్మెల్యే సీటు కోసం మరొకరు తమ పార్టీలను కేసీఆర్‌కు తాకట్టు పెట్టారన్నారు. సీతారామ ప్రాజెక్టుతో జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భద్రాచలం ఆలయానికి ప్రకటించిన రూ.100 కోట్ల సంగతేంటన్నారు. కరకట్ట నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ ఇంతవరకూ ఎందుకు విడుదల చేయలేదన్నారు. అంతకుముందు జడ్పీ సెంటర్‌ నుంచి పార్టీ కార్యకర్తలు, యువతతో కలిసి ర్యాలీగా పాత బస్టాండ్‌ వద్దకు సంజయ్‌ చేరుకున్నారు. పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఫొటో పెట్టలేదంటూ కొందరు నాయకులు ర్యాలీని బహిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని