నా కుమారుడిని చంపిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు

‘నా కుమారుడిని నమ్మించి తీసుకువెళ్లి చంపి, తిరిగి మాకే తీసుకొచ్చి ఇచ్చిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు’ అని ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 28 May 2023 04:32 IST

3 సెంట్లు స్థలం.. ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు
సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం

ఈనాడు, అమరావతి: ‘నా కుమారుడిని నమ్మించి తీసుకువెళ్లి చంపి, తిరిగి మాకే తీసుకొచ్చి ఇచ్చిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు’ అని ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా ఆమె తన భర్త సత్యనారాయణతో కలిసి తమ ఇబ్బందులపై గళం విప్పారు. ‘మా కుటుంబానికి ఆధారమైన కుమారుడిని అనంతబాబు చంపాడు. మా చిన్న కుమారుడు మా కుటుంబ పోషణ కోసం బయటకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఏడాది నుంచి పోరాడుతూనే ఉన్నాం. మాకు 3సెంట్ల స్థలం ఇస్తామన్నారు. అది ఇప్పటికీ అందలేదు. చంద్రబాబు ఇచ్చిన రూ.5లక్షలే మాకు ఆధారమయ్యాయి. ఏడాది నుంచి మేం దేనికీ లొంగకుండా అనంతబాబుపై పోరాడుతున్నాం. మాలాంటి వారికి న్యాయం జరగాలంటే చంద్రబాబును అందరూ గెలిపించాలి’ అని ఆమె కోరారు.

అనంతబాబుకు శిక్షపడేలా చేశాకే ఎస్సీల గురించి సీఎం మాట్లాడాలి: చంద్రబాబు

సుబ్రహ్మణ్యం తల్లి ఆవేదనపై చంద్రబాబు స్పందిస్తూ మాట్లాడారు.. ‘సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి.. అనంతబాబుకు శిక్ష పడేలా చేస్తే తప్ప.. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు ఉండదు. కేసులు పెడతారనే భయం ఉన్నా వెరవకుండా సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయం కోసం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. వాళ్ల అబ్బాయిని తీసుకువెళ్లి చంపి, అంత్యక్రియలు చేసుకోవాలని శవాన్ని తెచ్చి అనంతబాబు ఇచ్చారు. అలాంటి వ్యక్తి జైలు నుంచి బయటకొచ్చినపుడు ఊరేగింపుగా తీసుకువెళ్లారంటే.. ఏ దళితుడు మాట్లాడినా.. వారికీ సుబ్రహ్మణ్యానికి జరిగిందే జరుగుతుందని వైకాపా చెప్పే ప్రయత్నం చేసింది. న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మహానాడు వేదికగా సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నారు’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని