వారి ముందు వైకల్యం తలవంచింది

తెదేపాపై అభిమానంతో వైకల్యాన్ని అధిగమించి పార్టీ కోసం పనిచేస్తున్నవారిని మహానాడు వేదికపై చంద్రబాబు అభినందించారు.

Updated : 28 May 2023 06:36 IST

మహానాడుకు వచ్చిన దివ్యాంగులను అభినందించిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెదేపాపై అభిమానంతో వైకల్యాన్ని అధిగమించి పార్టీ కోసం పనిచేస్తున్నవారిని మహానాడు వేదికపై చంద్రబాబు అభినందించారు. వైకల్యం ఉన్నా తన సంపాదనలో రూ.30వేలు పార్టీకి విరాళంగా అందించిన జీవన్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. విశాఖకు చెందిన వాసు వైకల్యాన్ని అధిగమించి పార్టీ నిర్వహించే మహానాడుకు త్రిచక్ర వాహనంపై రావడం స్ఫూర్తి అని.. ఇద్దరినీ వేదికపైకి పిలిపించారు. మైక్‌ ఇచ్చి వారితో మాట్లాడించారు. ఈ సందర్భంగా జీవన్‌ మాట్లాడుతూ.. ‘‘చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన నేను 1997లో ఏడో నెలలో జన్మించారు. పుట్టుకతో కంటి చూపు.. రెండు కాళ్ల వైకల్యం ఉంది. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లినా కంటి చూపు రాదన్నారు. కాళ్లు పనిచేయవని వైద్యులు చెప్పారు. అప్పట్లో చంద్రబాబు ఆదేశాలతో బర్డ్‌ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. నాకు వైద్యం అందించేలా చేసిన తెదేపా కోసం సంపాదించిన మొత్తంలో రూ.30వేలు విరాళంగా అందిస్తున్నా. లోకేశ్‌ పాదయాత్ర జరిగినన్ని రోజులు నెలకు రూ.5వేల విరాళం ఇస్తాను’’ అంటూ.. విరాళాన్ని చంద్రబాబుకు అందించారు. ఇదే నాకు స్ఫూర్తి అంటూ చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఒకరికి సాయం చేస్తే.. వారు సంపాదించిన మొత్తంలో మళ్లీ పార్టీకి ఇస్తున్నారు.

* స్ఫూర్తిని అభినందిస్తున్నా. తెదేపా వల్ల కొన్ని లక్షలమంది ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొంది సంపాదిస్తున్నారు. వారంతా సమాజహితం కోసం కొంత విరాళంగా పార్టీకి అందిస్తే.. 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు సేవ అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.

* విశాఖకు చెందిన వాసు.. అంగవైకల్యాన్ని అధిగమించి తెదేపా కార్యక్రమాలకు త్రిచక్ర వాహనంపై వస్తున్నాడు. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు.. ఇప్పుడు జరిగే కార్యక్రమానికి అలాగే వచ్చారంటూ చంద్రబాబు అతన్ని వేదికపైకి పిలిపించుకుని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని