కదం తొక్కిన పసుపు దళం
చారిత్రక నగరి రాజమహేంద్రి... పసుపు సైనికుల కదనోత్సాహానికి సాక్షీభూతంగా నిలిచింది. మండే ఎండల్నీ, దూరాభారాల్నీ లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ పండుగ ‘మహానాడు’కు పోటెత్తారు.
మహానాడుకు వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు
ఎన్నికల సమరశంఖం పూరించిన అధినేత చంద్రబాబు
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు
రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
చారిత్రక నగరి రాజమహేంద్రి... పసుపు సైనికుల కదనోత్సాహానికి సాక్షీభూతంగా నిలిచింది. మండే ఎండల్నీ, దూరాభారాల్నీ లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ పండుగ ‘మహానాడు’కు పోటెత్తారు. అందరిలో సమరోత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలూ కలసిరావడంతో ఈ చారిత్రక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మహానాడు వేదికగా తెదేపా ఎన్నికల సమర శంఖారావం పూరించింది. గత ఏడాది ఒంగోలులో జరిగిన మహానాడు... న భూతో అనుకుంటే, దానికంటే ఘనంగా రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించారు. పార్టీశ్రేణులను రాబోయే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా మహానాడు జరిగింది. వచ్చే ఎన్నికల్ని కురుక్షేత్రంతోను, వైకాపా నాయకుల్ని కౌరవులతోను పోల్చిన తెదేపా అధినేత చంద్రబాబు... ఆ యుద్ధంలో విజయమే లక్ష్యమని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ వారిని కార్యోన్ముఖుల్ని చేశారు. వైకాపా నాయకులు కొందరు అడ్డంకులు సృష్టించేందుకు, కవ్వింపు చర్యలకు పాల్పడినా, పోలీసులు సహకరించకపోయినా తెదేపా శ్రేణులు క్రమశిక్షణతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. వేలసంఖ్యలో తరలి వచ్చిన ప్రతినిధులకు సౌకర్యాలు కల్పించడంలో పార్టీ వాలంటీర్లు విశేషంగా కృషిచేశారు.
ఇక యుద్ధమే..
పార్టీ మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరిగింది. ఆదివారం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెదేపా భారీ బహిరంగసభ తలపెట్టింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మహానాడు కావడంతో దీన్ని పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. శనివారం ప్రతినిధుల సభకు 15వేల మందికి ఆహ్వానాలు పంపితే... అనూహ్యంగా అంతకు అనేకరెట్లు హాజరైనట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలకు పార్టీశ్రేణుల్ని సంసిద్ధం చేసే దిశగా మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం సాగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన ఆయన... పార్టీ వైఖరిపైనా స్పష్టతనిచ్చారు. సంక్షేమమే పార్టీ పథమని తెలిపారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ, సంపద సృష్టించి, పేదల్ని ధనవంతుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలకు... పార్టీ అధికారంలోకి వచ్చాక అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ఒకటికి రెండుసార్లు చెప్పడం ద్వారా వారికి ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లుగా వైకాపా నాయకుల దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన కార్యకర్తల్ని పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పడం ద్వారా వారిలో మరింతగా సమరోత్సాహాన్ని నింపారు.
మండే ఎండల్నీ లెక్క చేయకుండా..
మహానాడు అంటేనే తెదేపా శ్రేణులు ఇంటి పండుగలా భావిస్తాయి. మహానాడుకు హాజరవడాన్ని ఒక గౌరవంగా భావిస్తాయి. శనివారం ప్రతినిధుల సభకు... భారీ సంఖ్యలో హాజరవుతారని పార్టీ అంచనా వేసినా, అన్ని వేల మంది వస్తారని ఊహించలేదు. అయినా.. వచ్చినవారిలో ఎవరికీ ఎలాంటి లోటూ లేకుండా పార్టీ ఏర్పాట్లు చేసింది. హాజరైన ప్రతినిధులందరికీ 16 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటుచేశారు. ఎండలు మండిపోతున్నా... పార్టీ ప్రతినిధులు ఓపికగా సభలో కూర్చుని, వివిధ తీర్మానాలపై నాయకుల ప్రసంగాల్ని శ్రద్ధగా విన్నారు. ఉదయం మహానాడు మొదలైనప్పటి నుంచి రాత్రి ముగిసేవరకూ కదలకుండా కూర్చున్నారు. ఒంగోలులో జరిగిన మహానాడులాగే, ఈసారీ పోలీసుల నుంచి సహకారం కొరవడింది. అంత పెద్ద సభ జరుగున్నా... బందోబస్తు అంతంతమాత్రంగానే ఉంది. ప్రధాన ప్రవేశద్వారాల వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నా... నియంత్రించే ప్రయత్నం చేయకుండా ఉన్న కొద్దిపాటి పోలీసులు గ్యాలరీల్లో కూర్చున్నారు. పార్టీ వాలంటీర్లే అన్ని బాధ్యతలూ తీసుకుని, ప్రతినిధుల్ని ఆయా గ్యాలరీలకు పంపించారు.
ముందస్తు మేనిఫెస్టో
ఎన్నికల వ్యూహాలకు ఇప్పట్నుంచే పదును పెడుతున్న తెదేపా అధినాయకత్వం... మహానాడు వేదికగా ఎన్నికల యుద్ధానికి తొలి అడుగు వేయబోతోంది. పార్టీ అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు చేపట్టబోయే సంక్షేమ పథకాలపై తొలిదశ మేనిఫెస్టోని ఆదివారం ప్రకటించబోతోంది. తెదేపా ఎన్నికలకు ఇంత ముందుగా మేనిఫెస్టోలోని ముఖ్యమైన పథకాల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని... వారి కోసం కొన్ని ప్రత్యేక పథకాల్ని తెదేపా అధినేత ఆదివారం ప్రకటించబోతున్నారు. పార్టీశ్రేణులకు ఎన్నికల యుద్ధానికి అవసరమైన ఆయుధాల్ని అందించడమే ముందస్తు మేనిఫెస్టో వెనుక ఉన్న లక్ష్యం. పార్టీ ఎన్నికల కార్యాచరణ, కార్యకలాపాలపైనా ఆయన ఆదివారం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
మహానాడులో రాష్ట్రానికి అత్యంత కీలకమైన పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. ముఖ్యమైనవి ఇవీ
దోపిడీదారుడికి, పేదలకు మధ్య ఇక యుద్ధమే
రాజకీయ తీర్మానం
రాజకీయ తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెడుతూ, ‘తొలి నుంచి జాతీయ రాజకీయాల్లో తెదేపా కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. మరే ప్రాంతీయపార్టీ ఈ స్థాయిలో సత్తా చాటుకోలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి తెదేపాకు ఈ ప్రాధాన్యం ఉంది. చంద్రబాబు రెండో తరం సంస్కరణలు అమలు చేశారు’ అన్నారు. ‘రాష్ట్ర సహజసంపదను దోచేస్తున్నారు. ఈ సంపద ప్రజలది. దోచుకున్న సంపద తిరిగి తీసుకుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. యుద్ధం ఈ మహానాడు నుంచే మొదలవుతుంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తెలుగుదేశం గమనిస్తోంది. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు
తీర్మానం: ‘యువత సంక్షేమం.. యువగళం’
ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రవేశపెట్టారు. పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున,తెలుగు యువత అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్, పొడపాటి తేజస్విని, తెలుగు యువత నాయకుడు వరుణ్‌కుమార్ బలపరిచారు. వారు మాట్లాడుతూ.. ‘తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు వచ్చిన స్పందన, యువతలో చైతన్యం కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించాం. వైకాపా తీరుతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయి. జాబ్ క్యాలెండర్ ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న సీఎం జగన్ వాలంటీరు ఉద్యోగాలతో యువతను మోసం చేశారు’ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ఈ చర్చలో చంద్రబాబు ప్రకటించారు.
వెనుకబడిన వర్గాల రక్షణకు ప్రత్యేక చట్టం
తీర్మానం: బీసీల ద్రోహి జగన్‌రెడ్డి
ఈ తీర్మానాన్ని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టగా.. కొల్లు రవీంద్ర, పంచుమర్తి అనురాధ, దాసరి శేషు బలపరిచారు. ‘తెదేపా హయాంలో మంత్రులుగా, రాజకీయ కీలక పదవుల్లో బీసీలు ఉంటే.. ఇప్పుడు జగన్ చుట్టూ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అని అంతా సామంత రెడ్లే ఉన్నారు. బీసీలను తన పక్కన జగన్ అసలు కూర్చోనిస్తారా?’ అని కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ‘బీసీల విదేశీ విద్య పథకాన్నీ జగన్ రద్దుచేశారు. 56 కార్పొరేషన్లతో ఒక్క రూపాయైనే బీసీలకు రుణాలిచ్చారా? అచ్చెన్నాయుడిని, నన్ను జైల్లో పెట్టించి వేధించారు’ అని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు నాకు అండగా నిలిచి, నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి సీఎం జగన్‌కు బుద్ధి చెప్పారు’ అని పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ అధికార ప్రతినిధి దాసరి శేషు కూడా దీనిపై మాట్లాడారు.
పేదోళ్లను ధనికులను చేసి చూపిస్తాం
తీర్మానం: సహజవనరుల దోపిడీ- ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజా, రెడ్‌శాండల్ మాఫియా
తీర్మానాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రవేశపెడుతూ, రాష్ట్రంలో క్విడ్ ప్రోకో, ఇన్‌సైడర్ ట్రేడింగ్, సూట్‌కేస్ కంపెనీలు, దోపిడీ, లూటీ వంటి పదాలన్నీ వినిపిస్తే గుర్తుకువచ్చేది జగన్‌మోహన్‌రెడ్డేనని ధ్వజమెత్తారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా నాలుగేళ్లలో రూ.28వేల కోట్లు, డిస్టిలరీలను తన గుప్పిట్లో పెట్టుకొని, కల్తీ బ్రాండ్ల పేరుతో రూ.13,500 కోట్లు కలిపి మొత్తం రూ.41,500 కోట్లు రాజప్రాసాదానికి వెళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నాలుగేళ్ల జగన్ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. సీబీఐ ఛార్జిషీటు వేసిన మొత్తమే రూ.43వేల కోట్లు. ఎమ్మెల్యేల దోపిడీ అదనం. ఇదంతా కక్కిస్తాం. పేదోళ్లను ధనికులను చేసి చూపిస్తా. ఇది పేదలు, పెత్తందారుల యుద్ధం కాదు. పేదలను ధనికులు చేసే యుద్ధం. ఇదే తెదేపా సంకల్పం. రాజమహేంద్రవరం నుంచి ఈరోజే ప్రారంభిస్తున్నాం. ఎవడు అడ్డొచ్చినా సైకిల్‌తో తొక్కుకొని పోతాం’ అన్నారు.
వివేకా హత్యపై జగనే సమాధానం చెప్పాలి
తీర్మానం: రాక్షస పాలన-రాజకీయ రాబందుల స్వైరవిహారం
‘ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేవారు. జగన్ పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అంటున్నారు’ అని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెదేపా యువనేత చింతకాయల విజయ్‌కుమార్ విమర్శించారు. ఈ చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీ బాబాయ్‌ని సాక్షాత్తూ మీ వారే చంపారని, ఇది అంతఃపుర హత్య అని సీబీఐ చెప్పింది. అవినాష్‌రెడ్డి మీతో టచ్‌లో ఉన్నారని, హత్య చేసే ముందు.. తర్వాత అవినాష్ ఇంట్లోనే దోషులంతా ఉన్నారని సీబీఐ పేర్కొంది. ఈ విషయాలు జగన్‌కూ తెలుసని వివరించింది. వీటిపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని నిలదీశారు. ‘వైకాపా రాబందుల చేతుల్లో చిక్కిశల్యమైన ప్రజాస్వామ్యాన్ని తెదేపా అధికారంలోకి వచ్చాక పునర్నిర్మిస్తాం. పౌరులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వాలు ఎంతటి బాధ్యతతో వ్యవహరించాలో చేసి చూపుతాం’ అని పేర్కొన్నారు.
పశువుల బీమా పథకమూ మోసమే
తీర్మానం: ‘రైతును దగా చేసిన జగన్‌రెడ్డి పాలన, తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం, నీటిపారుదల రంగం’
ఈ తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రవేశపెడుతూ.. వర్షాలు, వరదలతో రైతులు నష్టపోయినా.. సీఎం జగన్ ఎప్పుడూ చేలో అడుగు పెట్టలేదని, అన్నదాతలను పరామర్శించలేదని ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడులో అమూల్‌ను వ్యతిరేకించినా.. జగన్ రాష్ట్రానికి తెచ్చి సహకార డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ‘పశువుల శాఖ మంత్రి పశు నష్ట పరిహారం పథకాన్ని ఎత్తేశారు. మూడేళ్లలో రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు బీమా పేరుతో రైతుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కో పశువుకు రూ.30వేల పరిహారం ఇస్తారు. రూ.లక్షకు తక్కువ ఎక్కడైనా పశువు దొరుకుతుందా? జగన్‌రెడ్డి ప్రతి పథకం మోసమే’ అని ధ్వజమెత్తారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ సొమ్మును మంత్రులు దోచుకుంటున్నారని తెదేపా రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ మోసాలేనని ధ్వజమెత్తారు. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతును రాజుగా చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానానికి రూపకల్పన చేస్తామని చంద్రబాబు చెప్పారు.
మహిళా శక్తిని మహాశక్తిగా మలుస్తాం
తీర్మానం: మహిళా సంక్షేమంలో కోతలు- అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు
‘సీత ఉసురు తగిలి లంక దహనమైంది. ద్రౌపది శాపంతో కౌరవ సామ్రాజ్యం కూలింది. రాజధాని అమరావతి కోసం నాలుగేళ్లుగా మహిళా రైతులు చేస్తున్న ఆందోళన, ఆవేదన, చిందిస్తున్న రక్తం, ఆక్రందన జగన్‌రెడ్డిని, ఆయన పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాయి..’ అని ఈ తీర్మానంపై చర్చలో తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఇళ్లలో ఉన్న అమ్మలను, అక్కలను రోడ్లపైకి తీసుకొచ్చి అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిని ప్రోత్సహిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న వారిని చితక్కొట్టాలని తెలుగుమహిళ నాయకురాలు గౌతు శిరీష పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను మహాశక్తిగా తయారుచేసే కార్యక్రమాన్ని రూపొందించనున్నామని చంద్రబాబు తెలిపారు. ‘పురుషుల కంటే తాము తక్కువ కాదని, ఒకడుగు ముందుంటామని తెలుగు మహిళలు బ్రహ్మాండంగా చెప్పారు’ అని చంద్రబాబు వివరించారు.
ముస్లింల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం
తీర్మానం: మైనారిటీల సంక్షేమం
మైనారిటీల సంక్షేమంపై తెదేపా మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ తీర్మానం ప్రవేశపెట్టగా, అధికార ప్రతినిధి నాగుల్ మీరా, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమాన్యుయేల్ బలపరిచారు. ‘1985లో తొలిసారి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెదేపానే. హైదరాబాద్ నాంపల్లిలో 11 అంతస్తుల హజ్ భవనాన్ని చంద్రబాబు కట్టించారు. ఇప్పుడు రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవట్లేదు’ అని ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. ‘ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన రంజాన్ తోఫాను జగన్ రద్దుచేశారు. ముస్లిం ఆడపిల్లలకు పెళ్లి కానుకనూ రద్దు చేసిన జగన్‌కు బుద్ధి చెప్పాలి’ అని నాగుల్‌మీరా పిలుపిచ్చారు. ‘క్రైస్తవులను జగన్ మోసగించారు. ఒక్క క్రైస్తవ విద్యార్థినైనా విదేశీవిద్యకు పంపారా?’ అని ఇమాన్యుయేల్ ప్రశ్నించారు. ‘ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగేలా చూసే బాధ్యత తెదేపాదే. ముస్లింసంస్థల ఆస్తులపై దాడులు జరక్కుండా ప్రత్యేక చట్టం తెస్తాం. అన్ని వర్గాలకూ అండగా నిలుస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు
తీర్మానం: ‘సంక్షోభంలో ఎస్సీ సంక్షేమం’
‘సంక్షోభంలో ఎస్సీ సంక్షేమం’పై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెదేపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజు, మహాసేన రాజేష్ ఆ తీర్మానాన్ని బలపరిచారు. ‘14 నుంచి 15 శాతానికి ఎస్సీల రిజర్వేషన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే. 80లక్షల మంది దళితులు నమ్మి ఓటేస్తే వారందరికీ జగన్ ద్రోహం చేశారు. ఐదారు వందల మంది విద్యార్థులను అంబేడ్కర్ విదేశీవిద్య పేరుతో చంద్రబాబు చదివిస్తే అంబేడ్కర్ పేరు మార్చి తన పేరు పెట్టుకున్న దుర్మార్గుడు జగన్’ అని ఆనందబాబు ధ్వజమెత్తారు.ఎప్పుడో 10-15 ఏళ్ల కింద ఎక్కడో బిహార్‌లాంటి చోట దళితులపై దాడులు, హత్యాచారాలు జరిగేవి. కానీ జగన్ వచ్చాక ఈ దాడుల్లో ఏపీని నంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లారని ఎంఎస్ రాజు అన్నారు. ‘నేను అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దుచేశారు. దళితులకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను లాక్కున్నారు. దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించారు’ అని చంద్రబాబు ఆరోపించారు. ‘దళితులపై దాడులు చేసినవారికి, హత్య చేసినవారికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను తీసుకొస్తామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్