మహా వేదిక.. యువ స్వర వీచిక

రాజమహేంద్రవరం వేమగిరిలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేసిన కీలక ప్రకటన యువ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

Published : 28 May 2023 06:05 IST

చంద్రబాబు ప్రకటనతో నూతనోత్సాహం

ఈనాడు, కాకినాడ: రాజమహేంద్రవరం వేమగిరిలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేసిన కీలక ప్రకటన యువ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది. శనివారం నాటి సభలో తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా యువ నాయకులకే ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో 40 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో తెదేపా యవతలో సందడి నెలకొంది. ఆదివారం జరగనున్న బహిరంగ సభ వేదికపై మహిళల సంక్షేమం, ప్రజాహిత కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు. ఎన్నికల తొలి మేనిఫెస్టో ఇదే వేదికపై ప్రకటించనున్నట్లు అధినేత తెలపడంతో ఆసక్తి నెలకొంది.

చైతన్య ఝరి..

మహానాడు ప్రధాన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చైతన్యరథం చేరుకుంది. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ఈ రథంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేదిక పక్కనే దీనిని ప్రదర్శించి.. ఆ పక్కనే భారీ ఎన్టీఆర్‌ ప్రతిమ ఏర్పాటుచేయడం ఆకట్టుకుంది. 

గుండెల నిండా అభిమానం..

చంద్రబాబు రావాలి.. రాష్ట్రం బాగుపడాలి.. అనే నినాదంతో ఏటా మహానాడుకు హాజరవుతున్నట్లు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన గుంటూరు మనోహర్‌ అన్నారు. సైకిల్‌ గుర్తు చేతపట్టుకుని..చంద్రబాబు చిత్రాలతో ఉన్న దుస్తులు వేసుకుని ఆయన వేదిక వద్దకు వచ్చారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ అన్నారు. ప్రజలకు అన్నంపెట్టే నాయకుడు అధికారంలోకి రావాలని కోరుతూ తెదేపా తరఫున ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

దివ్యమైన ఆకాంక్ష..

ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు అస్సలు బాగులేదు.. దివ్యాంగులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండని తాళ్లపూడి మండలానికి చెందిన ఏలుగంటి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. రెండుకాళ్లు చచ్చుబడినా ఈడ్చుకుంటూ వచ్చి మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. తెదేపాపై అభిమానంతో ఇక్కడికొచ్చానని అన్నారు.
* రాజమహేంద్రవరానికి చెందిన దివ్యాంగుడు గోవింద్‌ తన కుమార్తె కుసుమతో త్రిచక్ర వాహనంలో వచ్చారు. పీలేరుకు చెందిన దివ్యాంగుడు షబ్బీర్‌ హుస్సేన్‌ మహానాడులో పాల్గొని అభిమానం చాటుకున్నారు.

బారికేడ్ల ఏర్పాటు

మహానాడు బహిరంగ సభ వేదిక ప్రాంగణం శనివారం సాయంత్రానికి సిద్ధమైంది. వివిధ జిల్లాల నుంచి లక్షల్లో వచ్చే అవకాశం ఉండడంతో తోపులాటకు ఆస్కారం లేకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.. షెడ్యూలు ప్రకారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు దివంగత ఎన్టీఆర్‌కు నివాళి.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటాయి. ప్రాంగణం నలుమూలలా ఫ్లడ్‌లైట్లు సైతం ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తెదేపా అధినేత చంద్రబాబు కోటిపల్లి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.

అకుంఠిత దీక్ష..

* మహబూబ్‌ నగర్‌కు చెందిన రాముడు తెలంగాణలో తెదేపా అధికారంలోకి రావాలని దీక్షపూనారు. అధికారంలోకి వచ్చేవరకు పసుపు వస్త్రాలు వేసుకోవాలని నిర్ణయించారు. ఈ దుస్తులతోనే మహానాడులో పాల్గొన్నారు.
* లోకేశ్‌ సీఎం కావాలని కోరుతూ ఈ ఏడాది శబరిమలకు సైకిల్‌ యాత్ర చేశానని.. 2024లోనూ యాత్ర చేస్తానని చీరాలకు చెందిన పాకల పాండు యాదవ్‌ మహానాడు వేదిక వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.
* మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఉంది.. ఎన్టీఆర్‌ అంటే వీరికి అంతులేని అభిమానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని మహానాడుల్లోనూ పాల్గొన్నామని సంఘం అధ్యక్షుడు జి.తిప్పన్న, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, కోశాధికారి నాగనాథ్‌ తదితరులు తెలిపారు.


35 ‘మహానాడు’లు చూశా

ఈయన పేరు గోనుగుంట్ల కోటేశ్వరరావు. నరసారావుపేట నుంచి రాజమహేంద్రవరంలో మహానాడుకు వచ్చారు. గతంలో తెదేపా విభిన్న ప్రతిభావంతుల విభాగం ఛైర్మన్‌గా పనిచేసిన ఈయన ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటి వరకు 35 ‘మహానాడు’లు చూశానని, ఈ సారి ఫోటో ఎగ్జిబిషన్‌ స్టాల్‌ నిర్వహణ బాధ్యతలను చంద్రబాబు తనకు అప్పగించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన గర్వంగా చెబుతున్నారు. వీల్‌ఛైర్‌లో స్టాల్‌ అంతా కలియ తిరుగుతూ తెదేపా శ్రేణులను ఆయన పలకరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. తెదేపా ఆవిర్భావం నుంచి సేకరించిన చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు.

సీతానగరం, పిఠాపురం


ముదిమి మీదపడినా మదినిండా తెదేపానే

పి.గన్నవరం, గోపాలపురం: ఆయన వయసు 75 సంవత్సరాలు. ఊరు విజయవాడ. తెదేపా ఆవిర్భావం నుంచి ఆయనకు ఆ పార్టీ అంటే ఎనలేని అభిమానం. చేతిలో ఊతకర్ర పట్టుకుని వెన్ను వంగినా వెరవకుండా శనివారం వేమగిరిలో నిర్వహించిన తెదేపా మహానాడు ప్రతినిధుల సభకు హాజరయ్యారు. విజయవాడకు చెందిన వాగిచర్ల హరినారాయణరావుకు నందమూరి తారకరామారావు అంటే ఎనలేని ప్రేమాభిమానం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పార్టీలో క్రియాశీలంగా కొనసాగుతున్నారు. వృద్ధాప్యం ఆవహించినా మండుటెండలో చేతిలో ఊతకర్ర పట్టుకుని వేమగిరిలో తెదేపా మహానాడుకు జోరుగా హుషారుగా వచ్చారు.


ఎల్లలు దాటిన  అభిమానం

రాజోలు, అల్లవరం, ముమ్మిడివరం న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌పై అభిమానంతో మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన అభిమానులు ఏటా మహానాడుకు వస్తున్నారు. 1973లో సోలాపూర్‌లో ఎన్టీఆర్‌ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన వీరు వేమగిరిలో శనివారం నిర్వహించిన ప్రతినిధు సభకు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణకు బహూకరించేందుకు చేతి అల్లికలతో తయారు చేసిన బాలకృష్ణ చిత్రపటాన్ని తీసుకొచ్చామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని