గడ్డిపోచలతో ఏనుగులను ఢీ కొట్టారు..

చిక్కాల రామచంద్రరావు.. 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు ఆయన కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటీన్‌ నడిపేవారు. యనమల రామకృష్ణుడు.. అప్పుడప్పుడే న్యాయవాదిగా నిలదొక్కుకుంటున్న యువకుడు.

Published : 28 May 2023 06:05 IST

సామాన్యులను బరిలోకి దింపి కాంగ్రెస్‌ దిగ్గజ నేతలపై గెలుపు
రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రతి అడుగూ సంచలనమే
యువతకు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట
ఎమ్మెల్యేలుగా గెలిపించి.. మంత్రుల్ని చేసిన వైనం

చిక్కాల రామచంద్రరావు.. 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించక ముందు ఆయన కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటీన్‌ నడిపేవారు. యనమల రామకృష్ణుడు.. అప్పుడప్పుడే న్యాయవాదిగా నిలదొక్కుకుంటున్న యువకుడు. కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన పాతికేళ్ల కుర్రాడు. మోత్కుపల్లి నర్సింహులు ఓ సాధారణ ఎస్సీ యువకుడు.

వారెవరికీ రాజకీయ నేపథ్యం లేదు. తాతతండ్రులెవరూ కనీసం ఆ ఛాయలకు కూడా వచ్చినవారు కాదు. ఎలాంటి రాజకీయ, ఆర్థిక నేపథ్యం లేని ఆ యువకులకు రాజకీయ ప్రవేశం అన్నది ఊహకు కూడా అందని విషయం. సీన్‌ కట్‌ చేస్తే.. తొమ్మిది నెలల తర్వాత వారంతా ఎమ్మెల్యేలైపోయారు. అదృష్టం కలసి వచ్చిన యనమల వంటివారు ఎన్టీఆర్‌ తొలి కేబినెట్‌లోనే మంత్రులూ అయిపోయారు.. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ సృష్టించిన రాజకీయ ప్రభంజన ఫలితం! ఆ పెనుగాలిలో మహా వృక్షాల్లాంటి కాంగ్రెస్‌ నాయకులు కూకటి వేళ్లతో పెకలించుకుపోగా.. గడ్డిపోచల్లాంటి వారు తలెత్తుకుని నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి బీజావాపన జరిగిన సందర్భం అది!

ఈనాడు, అమరావతి

అప్పటి వరకు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ, పెత్తందారులకు, భూస్వాములకే సొంతమైన రాజకీయాల్ని.. నేలకు దించి, రాష్ట్ర ప్రజలకు సరికొత్త రాజకీయాల్ని పరిచయం చేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌. తెదేపాను స్థాపించగానే అప్పటి వరకు సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రాజకీయాధికారానికి బాటలు పడ్డాయి. రాజకీయాల్లోకి కొత్త నీరు వెల్లువలా వచ్చింది. వారి సామాజిక, ఆర్థిక స్థాయిని పట్టించుకోకుండా.. అంకితభావం, చిత్తశుద్ధి చూసి ఎన్టీఆర్‌ వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌ చైతన్యరథంపై ప్రచారం నిర్వహిస్తుండగా మోత్కుపల్లి నర్సింహులు ఆయనను కలిసి, ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వాలని కోరారు. అక్కడున్న జనాల్ని ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడమని ఎన్టీఆర్‌ సూచిస్తే.. మోత్కుపల్లి ఉత్సాహంగా, ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన అభ్యర్థిత్వానికి తారక రామారావు అక్కడికక్కడే ఆమోదముద్ర వేశారు.

రాజకీయాలకు కొత్త దశ, దిశ

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ గుత్తాధిపత్యం కొనసాగుతున్న సందర్భం అది. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో నామమాత్రపు ప్రాధాన్యం ఉండేది. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం రాజ్యమేలేవి. దిల్లీలో రిమోట్‌ కంట్రోల్‌ పెట్టుకుని.. ఇక్కడి రాజకీయాల్ని, ముఖ్యమంత్రుల్ని ఆటబొమ్మల్లా ఆడించేవారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రయ్యాక ఈ ధోరణి మరింత పెరిగింది. ముఖ్యమంత్రుల్ని పదే పదే మార్చడంతో రాజకీయ అస్థిరత నెలకొనేది. కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయమే లేదనుకున్న దశలో.. రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్‌, కొద్ది నెలల్లోనే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో దాని భవిష్యత్తేంటో అర్థమయ్యేలా చేశారు. తెదేపా ప్రారంభించే వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనపడేవారు. అలాంటి వాతావరణాన్ని ఎన్టీఆర్‌ ఒక్క దెబ్బతో మార్చేశారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమే లేదనుకున్న చోట, ఆ పార్టీని తొమ్మిది నెలల్లోనే మట్టి కరిపించి, బలమైన దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు.

శాసనసభ్యులకు ప్రవర్తనా నియమావళి

రాజకీయాల్ని సమూలంగా ప్రక్షాళించేందుకు, రాష్ట్ర ప్రజలకు కొత్త తరహా రాజకీయాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్టీఆర్‌ కంకణం కట్టుకున్నారు. ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళి జారీ చేశారు. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో వారు జోక్యం చేసుకోకూడదని, అవినీతి నిర్మూలనకు సహకరించాలని, మంత్రులు సన్మానాలకు దూరంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా..

ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన 1984 ఎన్నికల్లో సానుభూతి పవనాల్లో దేశవ్యాప్తంగా మిగతా పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. తెదేపా ఒక్కటే ఆ గాలిని తట్టుకుని దీటుగా నిలబడింది. సొంతంగా 30 లోక్‌సభ స్థానాల్ని గెలిచి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఒక ప్రాంతీయ పార్టీకి అలాంటి గౌరవం దక్కడం అసాధారణం.

ప్రచారం నుంచి అన్నీ సంచలనాలే!

ఎన్నికల ప్రచారం నుంచి, విజయం సాధించి ప్రజల మధ్యే ప్రమాణ స్వీకారం చేయడం, పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం వరకూ.. ఎన్టీఆర్‌ ప్రతి చర్యా సంచలనమే. ఆయన టికెట్లు ఇచ్చేటప్పుడే.. ఎన్నికల తర్వాత పార్టీ మారితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తామని అభ్యర్థుల చేత ప్రమాణం చేయించారు. ప్రతి అభ్యర్థి ఎన్టీఆర్‌ పక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆ ఫొటోలు ప్రముఖ పాత్ర పోషించాయి.

ఎన్నికల ఖర్చుగా రూ.5 వేలు

తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా దన్ను లేదు. 1983 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మాత్రం ఎన్నికల ఖర్చుగా రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రెండో విడతగా మరో రూ.ఐదు వేలు ఇచ్చారు. అభ్యర్థులు హైదరాబాద్‌ రావాలని పార్టీ ఆదేశిస్తే.. భారీగా నగదు ఇస్తారనుకుని చాలా మంది ట్యాక్సీలు కట్టించుకుని పెద్ద సూట్‌కేసులతో వచ్చి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మినహా మిగతా వారికి తెదేపా పాటలు, ఎన్టీఆర్‌ ప్రసంగాల క్యాసెట్లు, పోస్టర్లూ, కరపత్రాలు ఇచ్చారు.

* పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, అందరికీ తాగునీటి సరఫరా, పిల్లలకు పోషకాహారంతో కూడిన ఉచిత మధ్యాహ్న భోజనం వంటి ముఖ్యాంశాలతో తెదేపా మేనిఫెస్టో విడుదల చేశారు. 

* మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తొలితరం శాసనసభ్యులకు ఎన్టీఆర్‌ ఉపదేశించిన తారకమంత్రం ఒక్కటే. ‘ప్రజలే దేవుళ్లు... సమాజమే మన దేవాలయం’. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలని, ప్రజల మనిషి అనిపించుకోవాలని ప్రతి శాసనసభ్యుణ్నీ ఆయన ఆదేశించారు.

* అది వరకు రాజ్‌భవన్‌లో కొద్ది మంది ఆహూతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేసేవారు. ఎన్టీఆర్‌ ఆ పద్ధతి మార్చేశారు. లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష జనం మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. అది వరకు కాంగ్రెస్‌ హయాంలో మంత్రివర్గం భారీ పరిమాణంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఎక్కువ శాఖల్ని తమ వద్దే అట్టేపెట్టుకునేవారు. ఎన్టీఆర్‌ సహచర మంత్రులకు ఎక్కువ శాఖలు కేటాయించారు. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించేవారు. 

తెదేపా అభ్యర్థుల సగటు వయసు 41 సంవత్సరాలే!

కాంగ్రెస్‌ హయాంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప మిగతాచోట్ల భూస్వాములకు, పెత్తందార్లకే టికెట్లు దక్కేవి. ఆ విధానాన్ని ఎన్టీఆర్‌ పూర్తిగా మార్చేశారు. యువకులు, విద్యావంతులకు అవకాశం కల్పించారు. వెనుకబడిన కులాల్లో రాజకీయ చైతన్యం తెచ్చి, వారికి రిజర్వేషన్లు కల్పించి, గెలిపించి మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రజలకు, రాజకీయ నాయకులకు మధ్య దూరాన్ని తగ్గించారు. 1983 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల సగటు వయసు 41 సంవత్సరాలు కాగా కాంగ్రెస్‌ అభ్యర్థుల సగటు వయసు 50 ఏళ్లు. తెదేపా అభ్యర్థుల్లో 28 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు సహా 125 మంది పట్టభద్రులున్నారు. 40 మంది ఎస్సీలను అభ్యర్థులుగా నిలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని