బాబు హయాంలోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి

‘తెలంగాణలో ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థను తెచ్చిన ఘనత ఆయనదే. యువత నెలకు లక్షల రూపాయల్ని సంపాదిస్తున్నారంటే దానికి కారణం బాబు కృషే.

Updated : 28 May 2023 06:20 IST

పొగాకు జయరామ్‌, తెలంగాణ తెదేపా నాయకుడు

‘తెలంగాణలో ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థను తెచ్చిన ఘనత ఆయనదే. యువత నెలకు లక్షల రూపాయల్ని సంపాదిస్తున్నారంటే దానికి కారణం బాబు కృషే. తెలంగాణలో చంద్రబాబు మైక్రోసాఫ్ట్‌ పెడితే... ఆంధ్ర సీఎం జగన్‌ మటన్‌ దుకాణాలు పెడుతున్నారు’ అని తెదేపా తెలంగాణ నాయకుడు పొగాకు జైరామ్‌ అన్నారు. మహానాడులో ‘తెలంగాణ యువజన సమస్యలు’పై తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో తెదేపా జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకున్నామని, ఏపీలో జగన్‌ పాలనలో ప్రాణాలు కోల్పోయిన తెదేపా కార్యకర్తలు, కేసులు లెక్క చేయకుండా కొట్లాడుతున్న వారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పారు. ‘అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం 18 గంటలు కష్టపడే నాయకుడు చంద్రబాబు. జగన్‌ పాలనలో ఉద్యోగం లేదు.. పరిపాలనా లేదు’ అని విమర్శించారు. ‘రాజశేఖరరెడ్డి చనిపోయాక సీఎం కావడానికి జగన్‌ సంతకాలు సేకరించడాన్ని వెన్నుపోటు పొడవడం అంటారు. తల్లి, చెల్లిని తరిమేయడం వెన్నుపోటు... ఒక ఎంపీ పదవి కోసం సొంత బాబాయ్‌ను చంపేయడాన్ని వెన్నుపోటు అంటారు’ అని ఎద్దేవా చేశారు.


విభజన హామీలు అమలు కాలేదు

- జక్కలి ఐలయ్య, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ తెదేపా 

విభజన హామీల్లో భాగంగా తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేదని తెదేపా తెలంగాణ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ విమర్శించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీలు, వైఫల్యాలు’ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గిరిజన విశ్వవిద్యాలయం హామీని అటకెక్కించారు. హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలం కాగా.. వాటిని సాధించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ విఫలమైంది. తెలంగాణ కోసం అమరులైన విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. దళితులకు మూడు ఎకరాలిస్తామని చెప్పి ఇవ్వలేదు. గిరిజనులకు పోడు భూమి పట్టాలు ఇస్తామని చెప్పి, పట్టించుకోలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, ప్రశ్నపత్రాల్ని లీక్‌ చేసి, యువత ఆత్మహత్యలు, ఆందోళనకు ప్రభుత్వం కారణమైంది. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలు చేయలేదు. కేసీఆర్‌ విధానాలకు వ్యతిరేకంగా తెదేపా పోరాడుతుంది’ అని ఐలయ్య యాదవ్‌ అన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంజయ్య తెలిపారు. తీర్మానాన్ని బలపరుస్తూ ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని