వివేకా హంతకుల్ని కాపాడటం చూసి వైఎస్‌ ఆత్మ క్షోభించదా?

మహానాడుకు వచ్చిన ప్రజా స్పందన చూసి ఓర్వలేకే మంత్రులు, వైకాపా నేతలు విమర్శలతో విషం చిమ్ముతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 28 May 2023 06:19 IST

మహానాడును చూసి ఓర్వలేకే మంత్రుల విమర్శలు
తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహానాడుకు వచ్చిన ప్రజా స్పందన చూసి ఓర్వలేకే మంత్రులు, వైకాపా నేతలు విమర్శలతో విషం చిమ్ముతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. కడుపు మంటతోనే మంత్రులు రోజా, జోగి రమేశ్‌, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మహానాడును చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందంటున్న వైకాపావారు.. వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలు, హంతకుల్ని కాపాడటం చూసి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభించదా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా సొంత బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోని జగన్‌.. చంద్రబాబు, తెదేపా మీద విమర్శలు చేయించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మహానాడును అడ్డుకోవడానికి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ చేయని ప్రయత్నం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వేమగిరిలోని మహానాడు ప్రాంగణంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, బండారు సత్యనారాయణ మూర్తి, కొల్లు రవీంద్ర శనివారం విలేకరులతో మాట్లాడారు.

3 కి.మీ. ట్రాఫిక్‌ జాం చేయించారు: సోమిరెడ్డి

‘వైకాపా నేతలకు కనీస సంస్కారం లేదు. ఎంపీ మార్గాని భరత్‌ చేస్తున్న పనులు చూస్తుంటే సిగ్గేస్తోంది. హైవేలో 3 కి.మీ. మేర ట్రాఫిక్‌ జామ్‌కు ఆయన కారణమయ్యారు. తెదేపా శ్రేణుల్ని రెచ్చగొట్టేలా పోటీగా నగరమంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించారు. చివరికి ఎన్టీఆర్‌ విగ్రహం చుట్టూ వైకాపా జెండాలు కట్టడం ఆ పార్టీ నేతల కుసంస్కారానికి నిదర్శనం.’

అభివృద్ధి లేని రాష్ట్రంగా మార్చారు: ఆలపాటి

‘అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వంతో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు.  ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. వైకాపా పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం ఖాయం.’

పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించారో జోగి రమేశ్‌ చెప్పాలి: బండారు

‘తన శాఖను గాలికొదిలిన గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్‌ తెదేపా కుటుంబంపై నోరు పారేసుకుంటున్నారు. మంత్రిగా ఆయన పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో గృహాలనే ఇప్పటివరకూ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీల్లో పునాదులు కొట్టుకుపోతున్నాయి. జోగి రమేశ్‌ వస్తే మా నియోజకవర్గంలోనే ఆ పరిస్థితులు చూపిస్తా.’

జగన్‌ కడుపు మంట అర్థమవుతోంది: కొల్లు రవీంద్ర

‘మహానాడు గురించి వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జగన్‌ కడుపు మంటకు నిదర్శనం. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్‌ పేరు పెట్టినప్పుడు, సంక్షేమ పథకాలకు ఆయన పేరు తొలగించినప్పుడు వారికి ఎన్టీఆర్‌ గుర్తుకు రాలేదా? వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయస్థానాలు, సీబీఐని తప్పుదారి పట్టిస్తున్నారు.’

లోకేశ్‌ ఫొటో కాకపోతే రోజా ఫొటో పెడతారా: ఆనం వెంకటరమణారెడ్డి

‘సీఎం జగన్‌, మంత్రి రోజా మొదలు వైకాపా నాయకులంతా ఉదయం నుంచే మహానాడును చూస్తున్నారు. అప్పటి నుంచే వారికి భయం పట్టుకుంది. అందుకే రోజా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ మీద సస్పెన్షన్‌ ఎత్తేయాలని రోజా అంటున్నారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిలను రాష్ట్రం నుంచి గెంటేసిన జగన్‌కు.. సొంత తల్లి, చెల్లి మీద సస్పెన్షన్‌ ఎత్తేయాలని రోజా చెప్పాలి. వివేకా కుమార్తె సునీత మీద సస్పెన్షన్‌ ఎత్తేయాలని చెప్పాలి. వైకాపా కార్యక్రమాల్లో విజయమ్మ, వైఎస్‌ వివేకానందరెడ్డి ఫొటోలు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలి. మహానాడులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఫొటోలు పెట్టకపోతే రోజాది, ఆయన భర్తది పెడతారా? అచ్చెన్నాయుడు శరీరాకృతి గురించి అసభ్యంగా మాట్లాడుతున్న రోజా ముందు తన శరీరాకృతి గురించి చూసుకోవాలి. మర్యాద ఇవ్వండి. మర్యాదగా విమర్శించండి. అది రాజకీయాల్లో హుందాగా ఉంటుంది. అంతేగానీ అనవసర విమర్శలు, దూషణలకు దిగితే అదే స్థాయిలో మేము ప్రతిస్పందిస్తాం.’

ఏ వ్యాపారాలు చేసి జగన్‌ సంపాదించారు: వైవీబీ రాజేంద్రప్రసాద్‌

‘హెరిటేజ్‌, తెదేపా, చంద్రబాబులపై బందరు పిచ్చోడు పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం స్ధాపించిన హెరిటేజ్‌ను నారా కుటుంబం అంచెలంచెలుగా పెంచి రూ.వందల కోట్ల టర్నోవర్‌ సాధించే స్థాయికి తీసుకెళ్లింది. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.9 లక్షల అప్పుందని పేర్కొన్న వ్యక్తి.. 2019 నాటికి రూ.వందల కోట్లు ఎలా సంపాదించారు? ఆయన అనుసరించిన వ్యాపార మెలకువలు అందరికీ చెప్పాలి.’

బాడీ షేమింగ్‌ సిగ్గుచేటు: మహాసేన రాజేశ్‌

‘తెదేపా నేతల శరీరాకృతి గురించి వైకాపా నేతలు అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. మహానాడుకు స్వచ్ఛందంగా వస్తున్న జనాన్ని చూసి వైకాపావారు, పేటీఎం బ్యాచ్‌వారు ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని