సామాన్యులే అసామాన్యులుగా!

సాధారణ కుటుంబం నుంచి వచ్చి... ఎన్టీఆర్‌ విధానాలకు ఆకర్షితులై, ఆయన కల్పించిన అవకాశాల్ని అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశం చేసిన ఎంతోమంది నవయువకులు తర్వాత అసామాన్యులుగా ఎదిగారు.

Updated : 28 May 2023 09:28 IST

సాధారణ కుటుంబం నుంచి వచ్చి... ఎన్టీఆర్‌ విధానాలకు ఆకర్షితులై, ఆయన కల్పించిన అవకాశాల్ని అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశం చేసిన ఎంతోమంది నవయువకులు తర్వాత అసామాన్యులుగా ఎదిగారు. సొంత అస్తిత్వాన్ని, గుర్తింపునీ సంపాదించుకున్నారు. జాతీయ స్థాయిలోనూ కీలక నేతలుగా ఎదిగారు. అలాంటి కొందరి ప్రస్థానమిదీ..


కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు: యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ 1982లో తెదేపా ఆవిర్భావంతోనే పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌ చేతిలో ఓడినా.. 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు తెదేపా అభ్యర్థిగా సిద్దిపేట నుంచి గెలిచారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉపసభాపతిగానూ పనిచేశారు. 2001 ఏప్రిల్‌లో ఉపసభాపతి పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెరాసను ఇటీవలే భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చారు.


కుందూరు జానారెడ్డి: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనుముల గ్రామానికి చెందిన జానారెడ్డి 1978 ఎన్నికల్లో జేఎన్‌పీ తరఫున చలకుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. తెదేపా ఆవిర్భావంతో పార్టీలో చేరిన ఆయన.. 1983, 1985 ఎన్నికల్లో గెలుపొందారు. 1988లో తెదేపా నుంచి బయటకు వచ్చి తెలుగు మహానాడు అనే పార్టీని స్థాపించారు. తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ పార్టీ తరఫున 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భవించాక శాసనసభలో తొలి ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.


రేణుకా చౌదరి: తెలుగుదేశం పార్టీలో చేరి కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆమెను తెదేపా రెండుసార్లు రాజ్యసభకు పంపింది. దేవెగౌడ కేబినెట్‌లో వైద్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగానూ రేణుకా చౌదరి పని చేశారు. 1998లో తెదేపా నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు.


మోత్కుపల్లి నర్సింహులు: అతి సామాన్య కుటుంబానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెదేపా ఆవిర్భావంతోనే పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.


తూళ్ల దేవేందర్‌గౌడ్‌: తెదేపా తరఫున రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికి పోటీ చేసి గెలిచిన దేవేందర్‌గౌడ్‌.. 1994 ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాల్లో పలు కీలకశాఖలు నిర్వహించారు. 2004 వరకు రాష్ట్ర హోం మంత్రిగానూ విధులు నిర్వహించారు. ఎంపీగానూ పని చేశారు.


కోడెల శివప్రసాదరావు: ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కోడెల శివప్రసాదరావుకు మంచి హస్తవాసిగల వైద్యుడిగా పేరుండేది. ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు తెదేపాలో చేరిన ఆయన 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో హోం, భారీ, మధ్య తరహా నీటిపారుదల, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యం వంటి కీలక శాఖలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా పనిచేశారు.


గంటి మోహన చంద్ర బాలయోగి: కాకినాడలో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న జీఎంసీ బాలయోగిని ఎన్టీఆర్‌ 1987లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేయించి, ఛైర్మన్‌ను చేశారు. 1991లో ఆయన లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1996 ఎన్నికల్లో ఓడిపోయాక.. ముమ్మిడివరం ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో లోక్‌సభకు ఎన్నికై.. 12వ లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌గా చరిత్ర సృష్టించారు.


బి.సత్యనారాయణరెడ్డి: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బి.సత్యనారాయణరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. 1978లో జనతాపార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ విధానాలు నచ్చి 1983లో తెదేపాలో చేరారు. 1984లో తెదేపా తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. 1990 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకూ గవర్నర్‌గా పనిచేశారు.


గోరంట్ల బుచ్చయ్య చౌదరి: వ్యాపారం చేసుకుంటున్న బుచ్చయ్య చౌదరి తెదేపా ఆవిర్భావంతో పార్టీలో చేరారు. 1983లో గెలిచిన తర్వాత.. ఆయనను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్టీఆర్‌ నియమించారు. తర్వాత ఆయన ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, తెదేపా శాసనసభాపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు.


పూసపాటి అశోక్‌ గజపతిరాజు: 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించేనాటికి జనతాపార్టీ శాసనసభ్యుడిగా ఉన్న అశోక్‌గజపతిరాజు.. ఎన్టీఆర్‌ ప్రకటించిన పథకాలు, ఆయన చిత్తశుద్ధికి ఆకర్షితుడై తెదేపాలో చేరారు. 1983లో విజయనగరం నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలకమైన శాఖలు నిర్వహించారు. 2014లో విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. ఎన్‌డీఏ ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా పనిచేశారు.


పూసపాటి ఆనందగజపతిరాజు: ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించిన పూసపాటి ఆనందగజపతిరాజు 1983 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్‌ తొలి మంత్రివర్గంలోనే ఆయనకు చోటు లభించింది. విద్య, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రిగా పనిచేశారు. ఎంపీగానూ సేవలందించారు.


కావలి ప్రతిభాభారతి: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రతిభా భారతి తెదేపా ఆవిర్భావంతోనే పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో విజయం సాధించి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలు నిర్వహించారు. 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.


చిక్కాల రామచంద్రరావు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిక్కాల రామచంద్రరావు కాకినాడ సమీపంలోని ఒక పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా.. తెదేపా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే ఆయన చేసిన కృషిని గుర్తించి 1983 ఎన్నికల్లో తాళ్లరేవు టికెటిచ్చారు. అప్పటి నుంచి 1999 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లోనూ పనిచేశారు.


యనమల రామకృష్ణుడు: న్యాయవాదిగా కాకినాడలో ప్రాక్టీస్‌ చేస్తున్న యనమలకు రాజకీయ నేపథ్యం లేకపోయినా.. ఆయన విద్యార్హతలు చూసి ఎన్టీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. తన తొలి మంత్రివర్గంలోనే న్యాయ, సహకారశాఖల సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. తర్వాత ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాల్లో స్పీకర్‌గా, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన, పార్టీ విధానాలు, మేనిఫెస్టో రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


కింజరాపు ఎర్రన్నాయుడు: శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం నిమ్మాడలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఎర్రన్నాయుడు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తయిన కొన్నాళ్లకే తెదేపా ఆవిర్భావంతోనే పార్టీలో చేరి 1983లో అప్పటి హరిశ్చంద్రపురం నుంచి గెలిచారు. పాతికేళ్ల పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఎంపీగానూ, కుమార్తె ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగానూ ఉన్నారు.


నర్రెడ్డి తులసిరెడ్డి: ఉమ్మడి కడప జిల్లాకు చెందిన తులసిరెడ్డి ఎన్టీఆర్‌ విధానాలు నచ్చి, తెదేపాలో చేరారు. ఆయనను 1986లో తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపారు. తర్వాత కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


సి.మాధవరెడ్డి: ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు చెందిన సి.మాధవరెడ్డి 1952 నుంచి 1957 వరకు తొలి లోక్‌సభలో సోషలిస్ట్‌ పార్టీ ఎంపీగా పనిచేశారు. 1962 నుంచి 1967 వరకు శాసనసభ్యునిగా ఉన్నారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 1984లో తెదేపా తరఫున ఎంపీగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తర్వాత తెదేపా అత్యధిక ఎంపీ స్థానాల్ని గెలుచుకుని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. అప్పుడు మాధవరెడ్డి తెదేపా లోక్‌సభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు.


ఎస్‌.రామచంద్రారెడ్డి: అనంతపురం జిల్లాకు చెందిన ఎస్‌.రామచంద్రారెడ్డి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనను ఎన్టీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. 1983, 1985ల్లో పెనుకొండ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంత్రిగా అవకాశమిచ్చారు. 1996లో ఆయన హిందూపురం నుంచి ఎంపీగానూ గెలిచారు.  


చింతకాయల అయ్యన్నపాత్రుడు: తెదేపా ఆవిర్భావంతో పార్టీలో చేరిన అయ్యన్నపాత్రుడికి 1983 ఎన్నికల్లో నర్సీపట్నం టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన అయ్యన్నను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 26 సంవత్సరాలే. ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో అనేక కీలక శాఖలు నిర్వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని