Chandrababu: భవితకు భరోసా

ఎన్నికల సన్నద్ధతలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా కీలకమైన ముందడుగు వేసింది. ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు ఉండగానే... కొన్ని కీలక పథకాలతో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో తొలి అంచె మేనిఫెస్టోను ప్రకటించింది.

Updated : 29 May 2023 10:01 IST

18 నుంచి 59 ఏళ్ల ఆడపడుచులకు... ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు రూ.1,500
చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులకు రూ.15 వేలు.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ
జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం
ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు
రైతన్నకు సంవత్సరానికి రూ.20 వేలు
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
పేదలను ధనికులుగా మార్చేందుకు ‘పూర్‌ టు రిచ్‌’
ఆరు కార్యక్రమాలు... పలు పథకాలు
తెదేపా మొదటి విడత మేనిఫెస్టోను మహానాడు వేదికపై ప్రకటించిన చంద్రబాబు
(రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

నా జీవితంలో ఎన్నడూ లేనంత కష్టపడతా. రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుంటా. ఇంతకు ముందెన్నడూ చూడని సుపరిపాలన అందిస్తా. వచ్చే మహానాడును అధికారపార్టీ హోదాలో నిర్వహించుకుందాం.

చంద్రబాబు


న్నికల సన్నద్ధతలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా కీలకమైన ముందడుగు వేసింది. ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు ఉండగానే... కొన్ని కీలక పథకాలతో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో తొలి అంచె మేనిఫెస్టోను ప్రకటించింది. మహిళలు, యువత, రైతులతో పాటు, పార్టీకి మొదటి నుంచి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలకు మేలు చేకూర్చేలా... మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీరు, పూర్‌ టు రిచ్‌ అనే ఆరు కార్యక్రమాల్ని తెదేపా అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం శివారులోని వేమగిరిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో... లక్షల మంది కేరింతల మధ్య ప్రకటించారు. ‘రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధానికి సైనికులకు ఆయుధాలు ఇవ్వాలి. కర్తవ్యాన్ని నిర్దేశించాలి. దానిలో భాగంగానే మొదట విడతగా భవిష్యత్తుకు గ్యారంటీని ఇప్పుడు ప్రకటిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే ఆయా కార్యక్రమాలు, పథకాల ప్రధాన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. వివరాలు ఇవీ...


మహిళా సాధికారతకు మహాశక్తి

ఈ కార్యక్రమం కింద నాలుగు పథకాల్ని ప్రకటించారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దుచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

* ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున వారి ఖాతాల్లో వేస్తారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ‘ప్రతి మహిళనూ ఒక మహాశక్తిగా తయారుచేయాలి. కుటుంబ బాధ్యతను మీకు అప్పగించాలి. మీ కష్టాలు నేను చూశాను. చాలీచాలని ఆదాయంతో, ఖర్చులు పెరగడంతో పిల్లల్ని చదివించుకోలేక కూలి పనులకు వెళ్లే, చిరు వ్యాపారాలు చేసుకునే ఆడబిడ్డలకు ఇది ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.90వేలు ఆడ బిడ్డల ఖాతాలకు పంపిస్తాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

* ‘తల్లికి వందనం’ కార్యక్రమం కింద... చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15వేలు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున అందజేస్తారు. ‘దీనివల్ల రెండు లాభాలున్నాయి. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఇప్పుడు పిల్లల్ని కనాలని చెబుతున్నాను. వాళ్లను బాగా చదివించి దేశానికి సంపదగా చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. మనకు యువతరం కావాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం కల్పిస్తాం. కొన్నిసార్లు అప్పటి పరిస్థితుల్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వాటివల్ల నష్టం వస్తుందని తెలిశాక సరిచేయడం మన బాధ్యత. అదే ఈరోజు చేస్తున్నాను’ అని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి వట్టి బూటకమని, ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఆ పథకం అమలుచేస్తానని చెప్పిన జగన్‌, ఆ మాటకు కట్టుబడకుండా మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

* ప్రతి ఇంటికీ సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘చిన్నప్పుడు మా తల్లి వంట చేస్తున్నప్పుడు పడే ఇబ్బందుల్ని చూశాను. పొగతో అమె కంట్లోకి నీళ్లు వచ్చేవి. కడుపులోకి పొగ వెళ్లిపోయేది. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని అప్పట్లో దీపం పథకం ప్రవేశపెట్టాను. జగన్‌ అనే దుర్మార్గుడు దీపం ఆపేశాడు. సిలిండరు ధర రూ.1,200కి చేరింది. మళ్లీ కట్టెపొయ్యిలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. తెదేపా అధికారంలోకి వచ్చాక మళ్లీ దీపం వెలిగిస్తాను’ అని తెలిపారు.

* మహిళలకు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడబిడ్డల్ని డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి... ఆఫీసులకు వెళ్లడమూ నేర్పించాను. ఇప్పుడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఈ వరాన్ని ప్రకటిస్తున్నాను’ అని తెలిపారు.


యువతకు అండ ‘యువగళం’

రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చేవరకు యువతకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ‘రాజకీయాల్లోనూ 40% యువతకు ప్రాధాన్యమివ్వాలని తెదేపా నిర్ణయించింది. రాష్ట్రంలోని యువతను ప్రపంచ ఆర్థికవ్యవస్థకు అనుసంధానం చేస్తాను. యువత తమకు ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు కావాలో... కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు కావాలో నిర్ణయించుకోవాలి. యువత ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు కులాలు, మతాల రొంపిలోకి దిగొద్దు. అబద్ధాలు చెప్పి, ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేవారిని నమ్మొద్దు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుడిని యువత నమ్ముతుందా? యువత ఎక్కడికి వెళ్లినా మీ రాజధాని ఏదని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి ఉందా?’ అని ఆయన మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ఎవరైనా విభేదాల సృష్టించేందుకు ప్రయత్నిస్తే చెప్పుతో కొట్టాలని, అప్పుడే వారికి బుద్ధొస్తుందని ఆయన పిలుపునిచ్చారు. ‘యువతకు కావలసింది భవిష్యత్తు. ఈ ఆధునిక సమాజంలో, నాలెడ్జ్‌ ఎకానమీలో ఇంకా అలాంటివి పెట్టుకుని నాశనమైపోవడం ఎంతవరకూ సబబో ఆలోచించండి’ అని పిలుపునిచ్చారు.


రైతన్నకు భరోసా ‘అన్నదాత’

న్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల ఆర్థికసాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘కరోనా సమయంలోనూ పనిచేసిన ఏకైక వ్యక్తి అన్నదాత. ఆ సమయంలో మిగతావారిలా రైతు కూడా ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు మనకు తిండి ఉండేదా? దేశంలో ఎవరూ తిండి లేకుండా బాధ పడకూడదని వ్యవసాయం చేసిన అన్నదాత కష్టాల్లో ఉన్నాడు. ఒకప్పుడు ఏపీ అంటే అన్నపూర్ణ. అలాంటి రాష్ట్రాన్ని, అన్నదాతను అప్పుల పాలు చేసి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తెచ్చింది. తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాను’ అని చంద్రబాబు తెలిపారు. ‘ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతుల ఆత్మహత్యల్ని నివారించడానికి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం’ అని ఆయన తెలిపారు.


ప్రతి ఇంటికీ మంచి నీళ్లు

‘మంచినీళ్ల కోసం ఆడ బిడ్డలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇంటింటికీ వంటగ్యాస్‌, కరెంటు, మరుగుదొడ్లు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ఎల్‌ఈడీ దీపాలు, చెత్త నుంచి ఎరువు తయారుచేసే షెడ్లు ఏర్పాటుచేసింది తెదేపా ప్రభుత్వమే. ఇప్పుడు మళ్లీ గ్రామాలన్నీ చెత్తతో నిండిపోయాయి. కనీసం మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచినీటి పథకం అమలుచేస్తాం’.


బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

‘బీసీలకు రక్షణ లేదు. వారిపై దాడులు జరుగుతున్నాయి.  బీసీలను ఆదుకునే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. వారి కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం.  బీసీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా’.


పేదల్ని ధనికులుగా మార్చేందుకు ‘పూర్‌ టు రిచ్‌’

పేదవారిని ధనికులుగా చేయాలన్నది తన సంకల్పమని, దాని కోసం ‘పూర్‌ టు రిచ్‌’ కార్యక్రమం అమలుచేస్తామని చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో పేదవారు లేకుండా ప్రతి ఒక్కరినీ ధనికులుగా చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పీ4) దీన్ని అమలుచేస్తాం. సమాజంలో బాగా స్థిరపడినవారు ఒకరిని గానీ, అంతకంటే ఎక్కువ మందిని గానీ పేదరికం నుంచి బయటకు తెచ్చి, ధనికులుగా మార్చే కార్యక్రమం చేపట్టాలి’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని