ధరణి తీసేస్తే మళ్లీ పైరవీలు, కమీషన్లే

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జరపబోమని కాంగ్రెస్‌ నేతలు పేర్కొనడం తెలంగాణ అమరులను కించపరచడమేనని.. జాతిని, రాష్ట్ర ప్రజలను తక్కువ చేసి చూపడమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 29 May 2023 03:42 IST

ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రమాదకరంగా ప్రతిపక్షాలు
భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: వైద్యసేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి ఆదివారం ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం లింగంపేట మండల కేంద్రంలో భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లికి సీఎం కేసీఆర్‌ రూ.1,00,116 సాయం చేస్తుండగా.. గుజరాత్‌లో కేవలం రూ.12 వేలు, అది కూడా పెళ్లయిన రెండేళ్ల తర్వాత మాత్రమే ఇస్తున్నారన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది

‘‘తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనేది ఇప్పుడు దేశంలో నానుడి. తెలంగాణ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు కావాలని మహారాష్ట్ర రైతులు పోరాటం చేస్తే అక్కడి ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసింది. ఇది మనకు గౌరవం కాదా..?’ అని మంత్రి అన్నారు. తెలంగాణలో ఉన్నట్లు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు సరఫరా, చెరువుల పునర్‌నిర్మాణం, పండిన పంట ఉత్పత్తులు కొనాలి అని ఇతర రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాలను అడుగుతున్నారు. మన పథకాలు బాగుండడం వల్లే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోంది’ అని మంత్రి తెలిపారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారు. అలా రద్దు చేస్తే పైరవీలు, కమీషన్లే రాజ్యమేలుతాయి. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 46అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు’ అని హరీశ్‌రావు అన్నారు.

డబుల్‌ ఇంజిన్ల రాష్ట్రాల్లో ఆయిల్‌ ఇంజిన్లు

‘భాజపా నేతలు డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటారు. కానీ వాళ్లు పాలించే రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా లేక రైతులు ఆయిల్‌ ఇంజిన్లతో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. తెలంగాణలో టార్చ్‌లైట్‌ పెట్టి వెతికినా ఆయిల్‌ ఇంజిన్లు కనిపిస్తాయా? రాష్ట్రంలో భాజపా నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు భారాసలో చేరేందుకు, మరికొందరు వేరే వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది’ అని మంత్రి అన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ ఎంకే ముజీబుద్దీన్‌, ఎల్లారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఫుడ్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ తిర్మల్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ తీరు అమరులను అవమానపర్చడమే

మెదక్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జరపబోమని కాంగ్రెస్‌ నేతలు పేర్కొనడం తెలంగాణ అమరులను కించపరచడమేనని.. జాతిని, రాష్ట్ర ప్రజలను తక్కువ చేసి చూపడమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలపై ఆదివారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రావతరణ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల పుట్టిన రోజు, స్వాతంత్య్రం లభించిన రోజని.. దీన్ని కాంగ్రెస్‌ నేతలు తక్కువ చేసి చూపడాన్ని ప్రజలు సహించరని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ముఖం చాటేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేడు దశాబ్ది ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి పది రాష్ట్రాల సీఎంలు హాజరు కాలేదని, ప్రధాని మోదీ చెప్పేది టీం ఇండియా అని, చేసేది మాత్రం తోడో ఇండియా అని మంత్రి దుయ్యబట్టారు. అసలు కేంద్రానికి ఎన్ని అప్పులున్నాయన్న విషయాన్ని కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలన్నారు. అభివృద్ధి కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్‌ ఛైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, చింత ప్రభాకర్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు చిట్టి దేవేందర్‌రెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని