BRS - KCR: మారకుంటే పునరాలోచన!

నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, ఎక్కువ కాలం బయటే గడుపుతున్నారని, మారకుంటే ఇబ్బంది తప్పదని ఒకరికి.. కింది స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లడం లేదని మరొకరికి.. ఇలా పలువురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించినట్లు తెలిసింది.

Updated : 29 May 2023 08:27 IST

భారాస ఎమ్మెల్యేలకు అధిష్ఠానం హెచ్చరిక
ఆ జాబితాలో సుమారు 15 మంది..
సర్వేలు, నిఘా వర్గాల సమాచారంతో పిలిచి మాట్లాడుతున్న అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘మీ అంతట మీరు పొరపాట్లు చేస్తే తప్ప.. ఈసారి ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలెవరినీ మార్చే ఉద్దేశం లేదు’ అంటూ సీఎం ఇటీవల కొన్ని సందర్భాల్లో సూచనప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా.. పనితీరు సరిగా లేని వారిని ఆయన పిలిచి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, ఎక్కువ కాలం బయటే గడుపుతున్నారని, మారకుంటే ఇబ్బంది తప్పదని ఒకరికి.. కింది స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లడం లేదని మరొకరికి.. ఇలా పలువురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించినట్లు తెలిసింది. నియోజకవర్గంపై పట్టులేని వారు, పలు విషయాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్రమత్తం చేస్తూ.. నడవడిక మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం ఇప్పటికే పిలిపించి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలపై క్రమం తప్పకుండా సర్వేలు చేయించడంతోపాటు నిఘా వర్గాల ద్వారా సమాచారం తీసుకుంటున్న సీఎం.. దారి తప్పుతున్న వారిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చెప్పిన తర్వాత కూడా పనితీరులో మార్పు రాకుంటే ఏమీ చేయలేమని కేసీఆర్‌ వారికి స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.

చివరి అవకాశంగా..

గత ఎన్నికల్లో కూడా బాగా వ్యతిరేకత ఉన్న, గెలవడం అసాధ్యమనుకున్న వారిని మాత్రమే మార్చిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పట్లో ఇలా అభ్యర్థులను మార్చిన స్థానాలన్నీ భారాసకు దక్కాయి. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇందులో భాగంగానే చివరి అవకాశంగా కొందరు ఎమ్మెల్యేలను సీఎం పిలిచి మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ మోస్తరు ‘మార్కులు’ కూడా రానివారికి చెప్పి చూడాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలా తుది హెచ్చరికలు చేసిన, చేయనున్న వారు సుమారు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, మార్పు రావాలని సీఎం హెచ్చరించినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరిని ఇలానే పిలిచి మాట్లాడినట్లు తెలిసింది.

కిందటిసారి ఓడిన వారికి..

కాంగ్రెస్‌ తరఫున గెలిచి.. తర్వాత భారాసలో చేరిన ఎమ్మెల్యేలున్నచోట ఓడినవారు మళ్లీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంలో అధినేత కేసీఆర్‌ వారికి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘గత ఎన్నికల్లో పార్టీ 88 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సమయంలో కూడా ఆ నాయకులు గెలిచారంటే వారికి నియోజకవర్గంపై పట్టు ఉండటం వల్లే సాధ్యమై ఉంటుంది’.. అనే అంచనాతో వీళ్ల విషయంలో ఒత్తిళ్లకు అధిష్ఠానం తలొగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.
* కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో ఓడిపోగా, అక్కడ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి భారాసలో చేరారు. టికెట్‌ కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొనడంతో పాటు పార్టీలోని కొందరు నాయకులు జూపల్లి వైపు మొగ్గుచూపినా ముఖ్యమంత్రి అంగీకరించలేదని తెలిసింది. చివరకు జూపల్లి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయనను సస్పెండ్‌ చేశారు.

* కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉండగా.. అక్కడ టికెట్‌ కోసం ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ అంతర్గతంగా ప్రచారం కూడా చేసుకొంటున్నారనే అభిప్రాయం ఉంది. జలగం వెంకట్రావు మళ్లీ రంగంలోకి వస్తారని కూడా అంటున్నారు. కానీ ఇక్కడ అభ్యర్థి విషయమై.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాల సమాచారం.

* తాండూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన పైలట్‌ రోహిత్‌రెడ్డి తర్వాత భారాసలో చేరారు. గత ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీ అయిన పట్నం మహేందర్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ‘మహేందర్‌రెడ్డిని గతంలో మంత్రిని చేశారు, ఆయన భార్యకు రెండోసారి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చారు. గత ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చినా ఆయన ఓడిపోయారు. అయినా ఆయనకు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అయ్యారు.. ఒక కుటుంబానికి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తార’ని భారాస నాయకుడొకరు అన్నారు. ఎమ్మెల్యేలందరి విషయంలో ముఖ్యమంత్రి ఒకే రకంగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు..


వారసులకు నో ఛాన్స్‌

పలువురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తమకు కాకుండా పుత్రులకు టికెట్‌ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన కుమారుడిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేయగా, ఇటీవల అక్కడ పర్యటించిన సీఎం.. మళ్లీ పోచారమే పోటీ చేస్తారని ప్రకటించారు. పోచారం కూడా తానే పోటీ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన కుమారుడి కోసం ప్రయత్నించగా.. కుదరదని అధినేత చెప్పినట్లు తెలిసింది. నిజామాబాద్‌ జిల్లా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఒక్కో ఎమ్మెల్యే తమ కుమారులను పోటీ చేయించాలని కోరుతుండగా సీఎం సానుకూలత వ్యక్తం చేయలేదని తెలిసింది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న ఓ ఎమ్మెల్యే, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశమివ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని