పార్లమెంటు మనకు ధర్మక్షేత్రం

‘‘దేశానికి చారిత్రాత్మకమైన రోజు. రాజదండం మన ధర్మానికి.. సంప్రదాయానికి గుర్తింపుగా మారింది. మన సంస్కృతి, రాజ్యాంగం రెండూ మన పార్లమెంటును ప్రతిబింబింపచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది.

Published : 29 May 2023 03:42 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ‘‘దేశానికి చారిత్రాత్మకమైన రోజు. రాజదండం మన ధర్మానికి.. సంప్రదాయానికి గుర్తింపుగా మారింది. మన సంస్కృతి, రాజ్యాంగం రెండూ మన పార్లమెంటును ప్రతిబింబింపచేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. అపురూపమైన పార్లమెంటు భవనాన్ని రూపొందించిన ప్రధానికి జనసేన తరఫున మద్దతు తెలుపుతున్నాం. ప్రపంచానికి పార్లమెంటు అయినా.. మనకుమాత్రం ధర్మక్షేత్రం. ధర్మాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో పార్లమెంటు కీలకంగా వ్యవహరిస్తుంది. పోర్ట్‌కల్లీస్‌ కిరీటం, ట్యూడర్‌ రాజుల బ్యాడ్జ్‌ యూకే పార్లమెంటుకు గుర్తుగా మిగిలింది. గాడ్‌ సేవ్‌ ది కింగ్‌/క్వీన్‌ బ్రిటన్‌ రాచరికపాలనకు గత వందేళ్లుగా జాతీయగీతంగా మారింది. మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా, ఆఫ్రికాలోని చాలా దేశాలు ఇస్లాంను తమ అధికార మతంగా మార్చుకున్నాయి. యూఎస్‌ అధికార పత్రాల్లో.. ‘గాడ్‌’ అనే అక్షరాలను మనం గమనించొచ్చు.ప్రధాని మోదీ శ్రమజీవులను సత్కరించి చాలా గొప్ప ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను ప్రధాని మెచ్చుకోవడం ఆయన గొప్పతనం’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

గల్ఫ్‌లో జనసేన ఆత్మీయ వేడుకలు

గల్ఫ్‌లోని ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ వేడుకలు దుబాయ్‌లో జరిగాయి. ఈ వేడుకలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, యూఏఈ దేశాల నుంచి వందల సంఖ్యలో హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీ రామారావు అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. దిల్లీ రాజకీయాలలో గుర్తింపు లేక తెలుగుజాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి ఘనవిజయం అందుకుని తెలుగువారి సత్తా దిల్లీ వరకూ చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన కొనియాడారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా పవన్‌కల్యాణ్‌ అంజలి ఘటించారు. ‘చరిత మరువని నటనా కౌశలం... తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం... ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారకరామారావు. సీఎం హోదాలో ఆయన ప్రకటించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది... ఎందరికో అనుసరణీయమైంది. సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీ రామారావు తెలుగుబిడ్డగా జన్మించడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ పుణ్యదినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని