పార్లమెంటు కొత్త భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్‌

పార్లమెంటు కొత్త భవన త్రికోణ ఆకృతిని ఒక శవపేటికతో పోల్చుతూ ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్‌ చేసింది. దీనిపై భాజపా మండిపడింది.

Published : 29 May 2023 04:33 IST

మండిపడ్డ భాజపా
దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌

దిల్లీ, పట్నా: పార్లమెంటు కొత్త భవన త్రికోణ ఆకృతిని ఒక శవపేటికతో పోల్చుతూ ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్‌ చేసింది. దీనిపై భాజపా మండిపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇలాంటి శవపేటికలోనే ఖననం చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్జేడీ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని భాజపా నాయకుడు సుశీల్‌ మోదీ డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆర్జేడీ ఈ ట్వీట్‌ చేసింది. ఒక శవపేటిక చిత్రాన్ని, కొత్త భవన ఫొటోను పక్కపక్కన పెడుతూ.. ‘ఇదేమిటీ’ అనే ప్రశ్నను సంధించింది. దీనికి భాజపా బిహార్‌ శాఖ స్పందించింది. ‘‘ఈ ట్వీట్‌లో మొదటి చిత్రం (శవపేటిక).. మీ భవిష్యత్‌. రెండోది (పార్లమెంటు).. భారత భవిష్యత్‌. అర్థమైందా?’’ అని బదులిచ్చింది. ఆర్జేడీ తన ట్వీట్‌ను సమర్థించుకుంది. ‘‘పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించిన తీరును చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖననం చేశారన్న అభిప్రాయం కలుగుతోంది. అందుకే శవపేటిక ఫొటోను ఉంచాం. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కానీ, ఉపరాష్ట్రపతిని కానీ ఆహ్వానించలేదు. ప్రజాస్వామ్యంలో ఇలా జరగదు’’ అని ఆ పార్టీ బిహార్‌ విభాగం అధ్యక్షుడు మృత్యుంజయ్‌ తివారి పేర్కొన్నారు. 

తీవ్ర అవమానం: వీహెచ్‌పీ

పార్లమెంటు కొత్త భవనాన్ని శవపేటికతో ఆర్జేడీ పోల్చడం.. ప్రజాస్వామ్య దేవాలయానికి పెద్ద అవమానమని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) దుయ్యబట్టింది. ఇది ప్రజా విశ్వాసంపై జరిగిన తీవ్ర దాడి అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ మండిపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని