కేసీఆర్‌ పాలనలో దళితులు, గిరిజనులకు తీరని అన్యాయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో దళితులు, గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

Published : 29 May 2023 04:33 IST

పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విమర్శ

తాడూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో దళితులు, గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి జలాశయం నిర్మాణంలో అంకాన్‌పల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డిపల్లి తండా, జీగుట్ట తండాలతోపాటు దళితులు అధికంగా ఉన్న అంకాన్‌పల్లి గ్రామం ముంపునకు గురికాగా.. బాధితులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ‘‘2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా.. జీవో నం. 123 పేరుతో రాత్రికి రాత్రి పోలీసులతో గ్రామాలను ఖాళీ చేయించి ప్రాజెక్టు పనులు చేపట్టడం బాధాకరం.  భూమికి భూమి, ఇళ్లకు ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించి.. నిర్వాసితుల కడుపులు  నింపాకే ప్రాజెక్టు  కడతామన్న మాట నిలబెట్టుకోవాలి. 4,500 ఎకరాల భూమి, 463 ఇళ్లను కోల్పోయిన ముంపు బాధితులను తక్షణమే ఆదుకోవాలి’’ అని  ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు