అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

‘సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను’ అని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 29 May 2023 04:33 IST

బీర్కూర్‌, న్యూస్‌టుడే: ‘సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను’ అని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రంలో రూ.7.20 కోట్లతో నాలుగు వరుసల రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, డ్రైనేజీ నిర్మాణం, రూ.1.10 కోట్లతో వెంకన్నకొండ వరకు సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో మున్నూరు కాపు సంఘం భవన ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ‘వయసు పైబడటంతో ఈసారి నా కుమారుల్లో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఇద్దామని అనుకున్నా.. కానీ ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా పిలిపించి, నన్నే పోటీ చేయాలని సూచించారు. సర్వేలు కూడా నాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా కుమారులకు ఏదో ఒక అవకాశం ఇస్తామని సీఎం అన్నారు’ అని పోచారం వివరించారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం వల్లే తనను ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలిపించారని, పలుమార్లు మంత్రిగా, సభాపతి స్థాయిలో ఉండగలిగానని చెప్పారు. కార్యక్రమంలో భారాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, స్థానిక భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని