Mahanadu: ఎన్నికల సమరనాదం

తెదేపా ఎన్నికల సమరశంఖం పూరించింది. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేసేలా తెదేపా అధినేత చంద్రబాబు కార్యాచరణ ప్రకటించారు.

Updated : 29 May 2023 06:09 IST

పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేసేలా కార్యాచరణ
తెదేపా మహాసభకు లక్షల్లో తరలి వచ్చిన జనం
రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

తెదేపా ఎన్నికల సమరశంఖం పూరించింది. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేసేలా తెదేపా అధినేత చంద్రబాబు కార్యాచరణ ప్రకటించారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరం శివారులోని వేమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పార్టీ తొలిదశ మేనిఫెస్టో విడుదల చేశారు. పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా, ఎన్నికలకు ఇంకా పది నెలలు ఉండగానే పలు కీలక పథకాల్ని ఆయన ప్రకటించారు. ఎన్నికలకు ఇంత ముందుగా తెదేపా మేనిఫెస్టో ప్రకటించడం పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి. తెదేపా ప్రకటించిన పథకాలు ప్రధానంగా మహిళలు, యువత, రైతులకు మేలుచేసేలా ఉన్నాయి. తెదేపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తుందంటూ వైకాపా చేస్తున్న ప్రచారాన్ని... మాటలతో కాకుండా, చేతలతో తిప్పికొట్టేలా సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తూ ముఖ్యమైన పథకాల్ని ప్రకటించారు. ముందస్తు మేనిఫెస్టో ప్రకటనలో దూకుడుగా వ్యవహరిస్తూనే, నేల విడిచి సాము చేయకుండా పథకాల్ని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు ప్రకటించినవి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలే. వీటిలో కొన్ని మార్పులు చేర్పులూ ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త పథకాలనూ తెదేపా ప్రకటించనుంది. దసరా నాటికి పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటించనుంది. వచ్చే ఎన్నికల్ని కురుక్షేత్ర సమరంగా అభివర్ణించిన చంద్రబాబు... ఆ యుద్ధంలో వైకాపా కౌరవుల్ని ఓడించాలంటే, పార్టీశ్రేణులకు బలమైన ఆయుధాలు అవసరమని చెప్పారు. తెదేపా ఇప్పుడు ప్రకటించినవి కీలకమైన ఆయుధాలుగా పేర్కొన్నారు. వాటిని ఇప్పటినుంచే ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక ఆయుధాలూ అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటిస్తున్నప్పుడు... పార్టీ కార్యకర్తల నుంచి విశేషస్పందన లభించింది. వారు హర్షధ్వానాలతో స్వాగతించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలు ప్రకటించినప్పుడు, వారి నుంచి మంచి స్పందన లభించింది.


చంద్రబాబు శంఖారావం

త్వరలో జరిగే కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడినుంచే శంఖం పూరిస్తున్నానంటూ చంద్రబాబు స్వయంగా శంఖం ఊదారు. ‘‘రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు, బహిరంగ సభ అదిరిపోయాయి. ఇది ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన నగరం. నన్నయ మహాభారతాన్ని ఇక్కడే అనువదించారు. మనం ఇక్కడి నుంచే కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రకటించాం. పార్టీశ్రేణులకు కురుక్షేత్ర యుద్ధానికి కావలసిన ఆయుధాలు ఇచ్చాను. రాబోయే యుద్ధంలో కౌరవుల్ని వధిస్తాం. అసెంబ్లీని గౌరవసభగా చేసి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతాను. మళ్లీ అధికారపార్టీ హోదాలో మహానాడు పెడదాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


పోటెత్తిన జనసంద్రం

రోహిణీకార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్న వేళ... రాజమహేంద్రవరంలో వరద పోటెత్తింది. నడి వేసవిలో వరద ఏంటనుకుంటున్నారా? అది తెదేపా మహాసభకు వెల్లువెత్తిన జన సునామీ..! అసలే తెదేపా జెండా పట్టిన ప్రతి కార్యకర్తా పెద్ద పండుగగా భావించే మహానాడు. పైగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి. ఎన్నికల సమరాంగణానికి పార్టీశ్రేణుల్ని సర్వసన్నద్ధం చేసే భారీ బహిరంగసభ.. తెదేపా కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకోవడానికి ఇంకేం కావాలి? రాష్ట్రం నలుమూలల నుంచి రెట్టించిన ఉత్సాహంతో రాజమహేంద్రికి వరద గోదారిలా జనం తరలివచ్చారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం, విద్యాసంస్థలు బస్సులిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో తెలంగాణ నుంచి టూరిస్టు బస్సుల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మరీ మహానాడుకు వచ్చారు.


ఉదయం నుంచే కోలాహలం

పసుపుదండు కదం తొక్కడంతో రాజమహేంద్రవరంలో ఆదివారం ఉదయం నుంచే ఎక్కడ చూసినా సందడి నెలకొంది. సభలో పాల్గొనేందుకు దూరప్రాంతాల వారు శనివారం రాత్రే నగరానికి చేరుకున్నారు. శనివారం ప్రతినిధుల సభకు హాజరైనవారికి వీరూ తోడవడంతో ఎక్కడ చూసినా తెదేపా కార్యకర్తల కోలాహలం కనిపించింది. వారందరికీ పార్టీ నాయకులు భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. ఆదివారం సభకు... ఉదయం నుంచే వాహనాలు తరలిరావడం మొదలైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ద్విచక్రవాహనాలపై ర్యాలీగా వచ్చారు. పాలకొల్లు నుంచి 150 కార్లతో తరలివచ్చారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి 8వేల మంది బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. ఆత్రేయపురం నుంచి 2వేల మంది మోటార్‌సైకిళ్లపై వచ్చారు.


ప్రళయం వచ్చినా కదలం

తెదేపా కార్యకర్తల క్రమశిక్షణకు, అకుంఠిత దీక్షకు, పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఆదివారం జరిగిన మహాసభ అద్దం పట్టింది. సాయంత్రం 3 గంటలకే లక్షల్లో తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం నిండిపోయింది. సాయంత్రం 4 గంటల సమయానికి ఉన్నపళంగా వాతావరణం మారిపోయింది. పెనుగాలులు వీచాయి. కారుమబ్బులు కమ్ముకున్నాయి. అప్పటివరకు మండే ఎండలు, ఉక్కబోత ఇబ్బంది పెడుతున్నా భరిస్తూ సభలో కూర్చున్నవారికి... ఒక్కసారిగా వాతావరణం భీతావహంగా మారడంతో కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. భారీ వానకు ఫ్లెక్సీలు పడిపోయాయి. ఒకపక్క నేతల ప్రసంగాలు కొనసాగుతుండగానే హోరున వాన మొదలైంది. అయినా సభకు ఇసుమంత కూడా అవరోధం ఏర్పడలేదు. నాయకులు తడుస్తూనే ప్రసంగాలు కొనసాగించారు. సభకు హాజరైనవారూ వానకు తడుస్తూనే ప్రసంగాలు విన్నారు. కాసేపటికి వర్షం ఆగిపోయి, సభ సజావుగా సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని