Chandrababu: హత్యలు చేయించే సీఎం అవసరమా?

‘వివేకానందరెడ్డిది అంతఃపుర హత్య అవునో కాదో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి... హత్యలు చేయించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

Updated : 29 May 2023 06:57 IST

ఆస్తుల్ని పెంచుకోవడమే ఆయన పని  
వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం
నా జీవితంలో ఎన్నడూ లేనంత కష్టపడతా
రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుంటా
మహానాడు సభలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు - అమరావతి

‘వివేకానందరెడ్డిది అంతఃపుర హత్య అవునో కాదో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి... హత్యలు చేయించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఆస్తుల్ని పెంచుకోవడం, హత్యలు చేయించడం, దోషుల్ని కాపాడటమే జగన్‌ పని. తెదేపా మాత్రం పేదల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తుంది’ అని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఘన విజయం సాధించి, అసెంబ్లీని గౌరవ సభగా తయారు చేసి అందులోకి అడుగు పెడతామని స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిర్వహించిన మహానాడు బహిరంగసభలో ఆయన వైకాపాపై నిప్పులు చెరిగారు. ‘నా జీవితంలో ఎన్నడూ లేనంత కష్టపడతా. రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుంటా. ఇంతకు ముందెన్నడూ చూడని సుపరిపాలన అందిస్తా. వచ్చే మహానాడును అధికారపార్టీ హోదాలో నిర్వహించుకుందాం’ అని అన్నారు. ‘జగన్‌ పని అయిపోయింది. జీవితంలో మళ్లీ సీఎంగా రారు.. రాలేరు. రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం ఉంది. తెదేపానే రాష్ట్రాన్ని కాపాడుతుంది’ అని స్పష్టం చేశారు. ‘ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన నగరం రాజమహేంద్రవరం. ఇక్కడి నుంచే కురుక్షేత్ర యుద్ధాన్ని మొదలు పెడుతున్నాం’ అని చెప్పారు.

లెక్క పెడుతున్నా...

‘వైకాపా వచ్చాక సర్వం దోపిడీయే. అంతా లెక్కపెడుతున్నా... అందరి దగ్గర నుంచి కక్కించి పేదలకు న్యాయం చేస్తాం. పేదలు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ఈమధ్య జగన్‌ అంటున్నారు. ఇది క్యాస్ట్‌ వార్‌కాదు... క్యాష్‌ వార్‌. ప్రజల డబ్బును దోచిన వారి నుంచి తిరిగి వసూలు చేసి.. పేదలను ధనికులుగా తయారు చేస్తాం’ అని చంద్రబాబు వివరించారు. సైకో సీఎం విధ్వంసం కారణంగా ఏపీ ఆదాయం తగ్గిపోయిందని, రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. ‘జగన్‌ హయాంలో పేదలు నిరుపేదలుగా మారారు. దోపిడీదారులు యథేచ్ఛగా దోపిడీ చేశారు. సీఎం ఆస్తి పెరిగింది. ఆయన సిమెంటు ఫ్యాక్టరీ, సాక్షి పత్రికల ఆదాయం పెరిగింది. యువత భవిష్యత్తు మాత్రం అంధకారమైంది. గోదావరిలో ఇసుక దొరకడం లేదు. అదంతా ఎక్కడికి పోతోంది?’ అని నిలదీశారు. ‘ఇసుకలో ఒక నెల ఆదాయం లేక డబ్బు కట్టలేనన్నందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుత్తేదారును వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ సీఎంకు సిగ్గు ఉందా? మనుషుల్ని చంపేస్తారా?’ అని మండిపడ్డారు. ‘రాజమహేంద్రవరంలో మహానాడు పెట్టుకుంటే అడ్డుకోవాలని రాక్షసుల్లా వ్యవహరించారు. అయినా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. మర్యాదగా ఉంటే మేమూ మర్యాదగా రాజకీయం చేస్తాం. అడ్డొస్తే సైకిల్‌ స్పీడ్‌ పెంచి తొక్కుకుంటూ పోతాం’ అని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల అర్జీలు

పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంపై 3 నిమిషాల వీడియోను చంద్రబాబు ప్రసంగానికి ముందు ప్రదర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న దాడులు, అఘాయిత్యాలను అందులో చూపారు. ‘ఆ పోలీసామె నా పీక పట్టుకుని పిసికింది. మమ్మల్ని ఇలా ఎందుకు చేయాలి? ఓట్లేసి గెలిపించినందుకు మాకిచ్చే బహుమానం ఇదేనా?’ అని వీడియోలో ఓ మహిళ కంటతడి పెడుతూ ప్రశ్నించింది. ‘మహిళలపై అత్యాచారాల్లో ఏపీ రెండోస్థానంలో ఉంది. పన్నుల పేరుతో బాదేస్తున్నారు. ఇసుక ధర పెరిగింది. మాకు లాభమేంది?’ అని కొందరు వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ... ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల అర్జీలు వచ్చాయని చెప్పారు. 150 రోజుల పాటు 15 వేల ఆవాసాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ధరల పెరుగుదల, తాగునీటి సమస్య, రైతుల బాధలు, నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ సమస్యలపై ఎక్కువ వినతులు అందాయని తెలిపారు. బహిరంగసభ వేదికపై నందమూరి అభిమానులను ఘనంగా సత్కరించారు.


సంక్షేమానికి నాంది పలికిందే తెదేపా

వైకాపాలో ఎమ్మెల్యే సీట్లను బానిసలకే ఇస్తారని, రౌడీలను, బూతులు తిట్టేవారిని చట్టసభలకు పంపిస్తారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. తెదేపా మాత్రం విద్యావంతుల్ని, ఆదర్శవంతుల్ని ఎంపిక చేసి సభలకు పంపిస్తుందన్నారు. వైకాపాది ధనబలమైతే... తెదేపాది ప్రజా బలమని, వాళ్లది జైలు రాజకీయమైతే... మనది విజన్‌ రాజకీయమని చెప్పారు. ‘పింఛను పథకాన్ని తెదేపానే ప్రారంభించింది. మన ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో సరిగా జీతాలు వచ్చే పరిస్థితి ఉందా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అమరావతి రాజధానికి భూసమీకరణ కింద రైతులు 34 వేల ఎకరాలు ఇవ్వడమే తెదేపాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. పోలవరం ప్రాజెక్టులో 72% పనులు పూర్తిచేశాం. రూ.16 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?’ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా రాజకీయం గురించి ఆలోచిస్తే ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చేవాడు కాదన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.


రాజకీయ రౌడీల్ని వదిలిపెట్టను

రాజకీయ రౌడీలు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. వారికి శిక్ష వేయించే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని చెప్పారు. ‘తెదేపా కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మన పార్టీని దెబ్బతీద్దామనుకున్న వారంతా కాలగర్భంలో కలిసిపోయారు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని