జగన్‌రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

జగన్‌రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. ‘‘జగన్‌ చేతిలో రాష్ట్రం నలిగిపోతోంది.

Published : 29 May 2023 05:09 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

జగన్‌రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. ‘‘జగన్‌ చేతిలో రాష్ట్రం నలిగిపోతోంది. ఆయనను ఓడించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ రాష్ట్రానికి తెదేపా, చంద్రబాబు పాలన అవసరం. ప్రజలను మోసం చేయాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు. దీన్ని దీటుగా ఎదుర్కోవాలి. వైకాపా పాలనలో ప్రజాధనాన్ని,  ప్రకృతి సంపదను దోచుకుని సంపాదించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఆ సంపాదనంతా బయటకు లాగి, పేదలకు పంచుతాం. రాష్ట్రంలో 160 శాసనసభ స్థానాలతో చంద్రబాబును సీఎం చేసే అవకాశం పార్టీ అధ్యక్షుడిగా నాకు దక్కడం అదృష్టం. ప్రపంచంలో ఎవ్వరికీ నిర్వహించని విధంగా ఎన్టీఆర్‌కు శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్‌తో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆయన పెట్టిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. సమావేశానికి వచ్చింది 10శాతమే. అనకాపల్లి, విజయవాడ వరకు రోడ్లన్నీ జామ్‌ అయ్యాయి. ఇంతమంది వచ్చారంటే చంద్రబాబుపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థమవుతుంది’’ అని వెల్లడించారు.


జైల్లో ఉన్నా జగన్‌లో పరివర్తన రాలేదు

- బండారు సత్యనారాయణమూర్తి

ఒక దుర్మార్గుడిని సీఎం చేశాం. మనం పెట్టిన అన్ని పథకాలను నాశనం చేశారు. 16 మాసాలు జైల్లో ఉన్నా జగన్‌లో పరివర్తన రాలేదు. మద్యం, ఇసుక, విశాఖ భూములు.. ఇలా అన్నింటా దోచుకుంటున్నారు. ఈ సీఎం కొత్తగా కట్టించిన ఇంటిలోకి ఓ కొత్త జంట కాపురం చేసేందుకు వెళితే.. ఒకరు పడుకోడానికే సరిపోతుంది. ఆ ఇళ్లు అలా ఉన్నాయి.


మళ్లీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు

- సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు

మరో ఆరు నెలల్లో జగన్‌రెడ్డి జైలుకు వెళ్తారు. చంద్రబాబు సీఎం అవుతారు. జగన్‌ మళ్లీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు. పింఛన్‌ రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి, ఏటా రూ. 250 చొప్పున పెంచుతున్నారు. ఇలా ఒక్కొక్కరికి రూ. 24,750 ఎగ్గొట్టారు. 25 లక్షల ఇళ్లు అని చెప్పి, 100 ఇళ్లు కూడా కట్టలేదు. నాలుగేళ్లుగా జగన్‌రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేసినా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, నేతలకు పాదాభివందనం చేస్తున్నాం.


తెదేపాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

-కళా వెంకటరావు

తెదేపాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుండి నడిపించారు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేసిన చంద్రబాబు విజన్‌ ఉన్న వ్యక్తి. చంద్రబాబు, లోకేశ్‌లను ముందుండి పోరాడమని మద్దతు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వైకాపా, జగన్‌పై పిడికిలి బిగించి, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు.


రాష్ట్రానికి విముక్తి కల్పించాలి

-కన్నా లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి. రాజధానిగా అమరావతిని కొనసాగించేలా పోరాడేందుకు అందరూ కంకణం కట్టుకోవాలి.


పైలాకు చంద్రబాబు సత్కారం

తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇచ్చిన అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన తెదేపా నేత పైలా ప్రసాదరావును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు వేదికగా అభినందించారు. ఆయనను శాలువాతో సత్కరించి ఎన్టీఆర్‌ ప్రతిమను బహూకరించారు.

 కె.కోటపాడు, న్యూస్‌టుడే

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని