TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’

మహానాడు బహిరంగ సభకు భంగం కలిగించేందుకు అధికార పార్టీ నాయకులు అనేక ఎత్తులు వేశారని తెదేపా నాయకులు ఆరోపించారు.

Updated : 29 May 2023 06:56 IST

తెదేపా నాయకుల ఆరోపణ

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కంబాలచెరువు, కడియం: మహానాడు బహిరంగ సభకు భంగం కలిగించేందుకు అధికార పార్టీ నాయకులు అనేక ఎత్తులు వేశారని తెదేపా నాయకులు ఆరోపించారు. శనివారం  నిర్వహించిన ప్రతినిధుల సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక కొంతమంది వైకాపా నాయకులు కుయుక్తులు పన్నారని వాపోయారు. సభకు వచ్చేవారికి ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకుని, ప్రైవేటు బస్సులు ఇస్తే కేసులు నమోదు చేస్తామని యాజమాన్యాలను వైకాపా వారు బెదిరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి బస కోసం పాఠశాలలను ఇవ్వాలని కోరినా అంగీకరించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆదివారం సాయంత్రం బహిరంగ సభ జరిగే సమయానికి గాలి, వాన రావడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినా సభ జరిగిన వేమగిరి, బొమ్మూరు ప్రాంతాల్లో మాత్రం ఇవ్వలేదు. రాత్రి 8 గంటలు దాటాక పునరుద్ధరించారు. అప్పటికి చంద్రబాబు ప్రసంగం చివరికి వచ్చింది. సభావేదిక వద్ద జనరేటర్ల సాయంతో విద్యుత్‌ను సరఫరా చేయడంతో ఇబ్బంది తలెత్తలేదు. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారులు వద్ద ప్రస్తావించగా గాలుల కారణంగా వేమగిరి ప్రాంతంలో గంట పాటు మాత్రమే సరఫరా నిలిపివేశామని చెప్పడం గమనార్హం.

* జాతీయ రహదారిపై పలుచోట్ల తెదేపా నాయకులు మహానాడు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. వాటి మధ్యలో అక్కడక్కడా వైకాపా వారు ఫ్లెక్సీలు పెట్టడంపై నాయకులు అసహనం వ్యక్తంచేశారు. అధికార పార్టీ వారు ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని సృష్టించేందుకూ కుయుక్తులు పన్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని