హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా జగన్‌?

ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వాటి అమలును వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం సీఎం జగన్‌కు, మంత్రులకు ఉందా? అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సవాలు విసిరారు.

Published : 30 May 2023 05:34 IST

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వాటి అమలును వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం సీఎం జగన్‌కు, మంత్రులకు ఉందా? అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సవాలు విసిరారు. మహానాడులో ఎన్టీఆర్‌ను గౌరవించలేదంటున్న వైకాపా నేతలు...జగన్‌ తన కన్నతల్లిని, చెల్లిని ఎంత గౌరవిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కడుపు మంట, అక్కసుతోనే తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘45 ఏళ్లు నిండిన మహిళలు, అవ్వాతాతలకు రూ.మూడు వేల పింఛన్‌ హామీ ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ? 2020 నాటికే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానన్న మాట సంగతేంటి? అమ్మఒడిని ఇంట్లో ఒక్కరికే ఎందుకు పరిమితం చేశారు? వీటన్నింటికీ మంత్రులు, వైకాపా నేతలు సమాధానం చెప్పాలి? కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని, పులిచింతల డ్యాం గేటు ఊడిపోతే బిగించలేని మంత్రి అంబటి రాంబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రివర్స్‌ టెండరింగ్‌తో ఏం సాధించారో వెల్లడించాలి? అంతే కానీ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు...’’ అని రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. ‘‘పంట నష్టపోయిన రైతుల్ని కనీసం పలకరించని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నేడు చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా రంగులేసుకోవడానికి తప్ప దేనికీ పనికి రావడం లేదు’’ అని ఆలపాటి పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని