వైకాపా పాలన తీరు చూసే.. ఏపీకి పెట్టుబడులు రావడంలేదు

వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబా అన్నారు.

Published : 30 May 2023 05:34 IST

కేంద్ర సహాయ మంత్రి భగవంత్‌ కుబా

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబా అన్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై కార్యకర్తలకు వివరించేందుకు సోమవారం విజయవాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పాలన తీరు చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. రాష్ట్ర అవసరాల కోసం ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీలో పీఎం, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ భేటీలకు ప్రత్యేకతలు లేవు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. రాష్ట్రంలో జనసేనతో భాజపాకు పొత్తు ఉంది. తెదేపాతో పొత్తుపై ఎవరైనా ఏదైనా చెబితే..అది వారి సొంత అభిప్రాయం మాత్రమే. పార్టీ వ్యూహాలను బయటకు చెప్పలేం. తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, మమతాబెనర్జీ విధ్వంసకర విధానాలు అవలంబిస్తున్నారు. గవర్నర్లతో సఖ్యతగా వ్యవహరించడం భాజపాయేతర ప్రభుత్వాలకు ఇష్టం లేదు. అందువల్లే తెలంగాణలో సమస్యలొస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 300 పైగా సీట్లు భాజపాకు వస్తాయి. దక్షిణాదిన కూడా తగినన్ని సీట్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సహ బాధ్యులు సునీల్‌ దేవధర్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలకు మోదీ తొమ్మిదేళ్ల పాలన విజయాలను వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని