వైకాపా, జనసేనల మధ్య ఫ్లెక్సీల రగడ

వైకాపా, జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఒంగోలులో సోమవారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Updated : 30 May 2023 13:17 IST

ఒంగోలులో ఉద్రిక్తత

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా, జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఒంగోలులో సోమవారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ‘పేదలకు.. పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం’ అంటూ వైకాపా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రతిగా ‘రాక్షస పాలనకు అంతం - ప్రజా పాలనకు ఆరంభం’ పేరుతో జనసేన నాయకులు ఆదివారం రాత్రి ఫ్లెక్సీలు నెలకొల్పారు. తాము ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారనే సమాచారంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలులోని చర్చి సెంటర్‌కు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపాకు చెందిన కార్పొరేటర్‌ జడా వెంకటేష్‌ తన అనుచరులతో అక్కడికి వచ్చారు. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఒకటో పట్టణ పోలీసులు వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. జనసేన ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని వైకాపా కార్పొరేటర్‌ జడా వెంకటేష్‌ తన అనుచరులతో కలిసి తొలగించారు. అక్కడే ఉన్న పోలీసులు వారించకుండా చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. సీఐ కె.వెంకటేశ్వర్లు, ఎస్సై కృష్ణయ్యలు జనసేన నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. వివాదాస్పద ఫ్లెక్సీలతో వైకాపా విద్వేషాలను రెచ్చగొడుతోందని దర్శి, కంభం పట్టణాల్లోనూ పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదులు చేశారు.


ప్రజల దృష్టి మళ్లించడానికే: జనసేన

విశాఖపట్నం(డాబాగార్డెన్స్‌), న్యూస్‌టుడే: ఎంపీ అవినాష్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను అవమానపరిచేలా సీఎం జగన్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారని జనసేన పీఏసీ సభ్యులు కోన తాతారావు ధ్వజమెత్తారు. సోమవారం విశాఖ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నేతలు బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జనసేన నాయకులు ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెట్టడం సరికాదన్నారు. వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని