ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చెప్పులతో కొట్టుకున్న వైకాపా కార్యకర్తలు

శ్రీసత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం వైకాపా నాయకుల్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Published : 30 May 2023 05:34 IST

కనగానపల్లి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం వైకాపా నాయకుల్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కనగానపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం పార్టీకి చెందిన రెండువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. కోనాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి కుటుంబ సభ్యులకు, అదే గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు పైలెట్‌ ముత్యాలు, బీసీ ముత్యాలుతో సఖ్యత కొరవడింది. అధికారులు తాము చెప్పినట్టు వినాలని ఒక గ్రూపు, కాదు తమ మాటే వినాలని మరో గ్రూపు నేతలు పట్టుబడుతున్నారు. ఉపాధి పథకం, గృహ నిర్మాణ పనుల్లో రెండు గ్రూపుల మధ్య విభేదాలు రావడంతో గొడవపడ్డారు. సోమవారం ఎంపీపీ భాగ్యమ్మ సమక్షంలో పార్టీ కార్యకర్తలకు సర్ది చెబుతున్న క్రమంలో అక్కడే ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు కలగజేసుకోవడంతో ఎంపీపీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత మళ్లీ గొడవ ప్రారంభమైంది. సర్ది చెప్పినా వినకుండా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. చివరికి పోలీసులు గట్టిగా మందలించడంతో ఇరువర్గాల కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జరిగిన ఘటనను అవమానంగా భావించిన ముత్యాలు అనే వ్యక్తి మనస్తాపం చెంది ఇంట్లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యశాలలో చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని