సీఎం జగన్ దిల్లీ పర్యటనకు రెండే ఎజెండాలు
సీఎం జగన్ దిల్లీ పర్యటనలు అప్పులు, హత్య కేసు నుంచి బయటపడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి కాదని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు.
ఒకటి హత్య కేసు నుంచి బయటపడడం
రెండోది అప్పులు తెచ్చి స్కామ్‌లు చేయడం
తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజం
ఈనాడు, దిల్లీ: సీఎం జగన్ దిల్లీ పర్యటనలు అప్పులు, హత్య కేసు నుంచి బయటపడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి కాదని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘సీఎం జగన్ దిల్లీ పర్యటనలో అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఆ తర్వాత మీడియాకు విడుదల చేసిన నోట్‌లో మాత్రం పోలవరం అంచనాలు, విభజన సమస్యలు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలపై చర్చించినట్లు పేర్కొన్నారు. జగన్ దిల్లీకొచ్చినప్పుడల్లా ఇదే ప్రకటనను విడుదల చేయడం అలవాటైంది. ఇప్పుడు రెండే ఎజెండాలు. అందులో ఒకటి వివేకా హత్య కేసు నుంచి బయటపడటం. రెండోది అప్పులు తెచ్చుకొని స్కామ్‌లు చేయడం...’ అని కనకమేడల ఆరోపించారు. ‘హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే సీబీఐ అధికారులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నించడం కర్నూలులో చూశాం. అధికారంలో ఉన్నవారు తలచుకుంటే హత్య కేసులోని నిందితులనూ రక్షించవచ్చని దీని ద్వారా నిరూపించారు.
వివేకా హత్య కేసులో జగన్ పాత్రనూ విచారించాల్సి ఉందని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. దీనిపై సీఎం మౌనం వహించడం వల్ల ఆయన పాత్రపై సందేహాలు మరింత బలపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రిని కలిసి వెళ్లడంపై ప్రజల్లో మరింత చర్చ మొదలైంది. ఇందులో ఆయనకు పాత్ర ఉందన్న అభిప్రాయాన్ని జరుగుతున్న పరిణామాలు ధ్రువీకరిస్తున్నాయి. దర్యాప్తు వేగం పుంజుకున్న ప్రతిసారీ ముఖ్యమంత్రి దిల్లీకొచ్చి కేంద్ర హోంమంత్రిని కలవడం, ఆ తర్వాత దర్యాప్తు మందగించడం జరుగుతోందని ప్రజలంతా భావిస్తున్నారు...’ అని రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ‘పేదలకు ప్రతినిధి అని చెప్పుకుంటున్న సీఎం పెత్తందారి రాజకీయాలు చేస్తున్నారు. మొదటి నుంచీ రివర్స్ ఆలోచనలు ఉన్న ఆయన అదే అలవాటుతో పెత్తందారి అయిన తనను తాను పేదగా ఉహించుకుంటున్నారు..’’ అని కనకమేడల ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.