వచ్చే మేనిఫెస్టోలో మరిన్ని అద్భుత అంశాలు

తెదేపా మొదటి విడతలో ప్రకటించింది కొంతేనని.. భవిష్యత్తులో ప్రకటించనున్న మేనిఫెస్టోలో మరిన్ని అద్భుతమైన అంశాలు ఉంటాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Updated : 30 May 2023 07:24 IST

అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపకల్పన
పార్టీ నాయకులతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా మొదటి విడతలో ప్రకటించింది కొంతేనని.. భవిష్యత్తులో ప్రకటించనున్న మేనిఫెస్టోలో మరిన్ని అద్భుతమైన అంశాలు ఉంటాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సభ విజయవంతమవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత వర్షం పడినా సభకు వచ్చినవారంతా తడుస్తూనే పాల్గొన్నారని, తద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, తెదేపాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు ప్రాంగణం నుంచి సోమవారం హైదరాబాద్‌ పయనమైన ఆయనను స్థానిక విమానాశ్రయం వద్ద పలువురు తెదేపా నేతలు కలిశారు. తొలి మేనిఫెస్టో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉందని, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని, వర్షంతో కొంత సమస్య వచ్చిందని వారు వివరించడంతో చంద్రబాబు పైవిధంగా స్పందించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వైకాపా ప్రభుత్వంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై సమీక్షించి వారు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే విధానం అమలు చేయాల్సి ఉందని నాయకులు సూచించగా... రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పారు. అలాగే అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉంటుందని, అందరితో సమీక్షించి రూపొందిస్తామని వెల్లడించారు. చంద్రబాబును కలిసిన వారిలో మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ, పీతల సుజాత, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, గన్ని కృష్ణ తదితరులు ఉన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మహానాడు ముగిసిన తరువాత రోడ్డు మార్గంలో కడపకు పయనమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని