సంక్షిప్త వార్తలు (5)

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ ఉత్సవాల నిర్వహణకు 29 మంది నాయకులతో రాష్ట్రస్థాయి కమిటీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు.

Updated : 31 May 2023 06:36 IST

రాష్ట్రావతరణ వేడుకలకు కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ ఉత్సవాల నిర్వహణకు 29 మంది నాయకులతో రాష్ట్రస్థాయి కమిటీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి ఛైర్మన్‌గా, ఇద్దరు చొప్పున కోఛైర్మన్లు, కన్వీనర్లు, 24 మందిని సభ్యులుగా నియమించినట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.


చంద్రబాబును మట్టుబెట్టాలనే కుట్ర: కాలవ

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చూస్తుంటే వైకాపా నాయకత్వం చంద్రబాబును భౌతికంగా మట్టుబెట్టాలనే కుట్ర చేస్తోందన్న అనుమానం కలుగుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్పీకర్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.


ప్రధాని మోదీ విజయాలను ఇంటింటికీ తెలియజేస్తాం: మాధవ్‌

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ అమలు చేసిన విధానాలతో ప్రతి రంగంలో దేశం పురోగతి సాధించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరైనా గత, ప్రస్తుత ప్రభుత్వాల అలసత్వం కారణంగా ముందుకెళ్లడం లేదన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు భాజపాకు మాత్రమే ఉందన్నారు. వైకాపా, తెదేపాలు... పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదు తిరిగి పంచడం తప్ప ఏమాత్రం కొత్త ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు.


ఆ మాటలు స్పీకర్‌ స్థాయికి తగవు: షరీఫ్‌

ఈనాడు, అమరావతి: రాజకీయాలకు అతీతంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించాల్సిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన పరిధులు దాటి తెదేపా అధినేత చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రజాస్వామ్య విధానాలకు, చట్టసభల సంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలిగించారని శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎంఏ షరీఫ్‌ అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అహంతో, రాజకీయ అక్కసుతో స్పీకర్‌ మాట్లాడుతున్నారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.


ఏపీ స్పీకర్‌ తమ్మినేనిపై చర్యలు తీసుకోండి

షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బక్కని నర్సింహులు ఫిర్యాదు 

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:  తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పీకర్‌గా గౌరవప్రదమైన హోదాలో ఉన్న తమ్మినేని.. చంద్రబాబు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను తొలగించాలనడం, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నేత గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం దారుణమన్నారు. సీఐ నవీన్‌కుమార్‌కు బక్కని నర్సింహులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని