మరో 15 ఏళ్లు అధికారం మనదే.. గోడ దూకొద్దు

రాష్ట్రంలో మరో 15 ఏళ్లు భారాస మాత్రమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని.. ఎవరూ గోడ దూకొద్దని సూచించారు.

Published : 31 May 2023 03:49 IST

భారాస నాయకులు, కార్యకర్తలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో 15 ఏళ్లు భారాస మాత్రమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని.. ఎవరూ గోడ దూకొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్‌కు ముందు.. కేసీఆర్‌ తరువాత అని మాట్లాడుకునేంతగా అభివృద్ధి పనులు చేశామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛను రూ.200కు తగ్గుతుందని, కరెంటు కోతలు మళ్లీ మొదలవుతాయని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను ఎత్తేస్తారని ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్ప భాజపా నాయకులు దేశానికి ఏం చేశారో ఏనాడూ చెప్పరన్నారు. ప్రైవేటీకరణతో ఉద్యోగుల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని