ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నారు

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎమ్మెల్యే బైరాన్‌ బిశ్వాస్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తీర్థం పుచ్చుకోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

Published : 31 May 2023 04:21 IST

పరస్పరారోపణల్లో కాంగ్రెస్‌, టీఎంసీ

దిల్లీ, కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎమ్మెల్యే బైరాన్‌ బిశ్వాస్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తీర్థం పుచ్చుకోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ముందున్న తరుణంలో విపక్షాల ఐక్యతను దెబ్బతీసే యత్నాలకు మీరు పాల్పడుతున్నారంటే కాదు మీరే పాల్పడుతున్నారంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఆ విధంగా వేటాడటం (కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను టీఎంసీలో చేర్చుకోవడం) ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు ఉపకరించదంటూ టీఎంసీని కాంగ్రెస్‌ తూర్పారబట్టింది. అటువంటి చర్యలు భాజపా లక్ష్యాల సాధనకు దోహదపడతాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ‘‘జాతీయ స్థాయిలో మనమంతా (ప్రతిపక్షాలంతా) కలిసే ఉన్నాం. ప్రాంతీయ పార్టీలకు సొంత బాధ్యతలు ఉంటాయనే విషయాన్ని అన్ని పార్టీలు గుర్తెరగాలి. మేఘాలయ, గోవాల్లో మాత్రమే మేం పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్‌ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో పోటీ చేస్తోంది. అక్కడ వారిని మేం ఇబ్బంది పెట్టడంలేదు. పైగా వారికి మద్దతిస్తున్నాం. నిజమే ఓ ఎమ్మెల్యే మా పార్టీలో చేరారు. మీరు (కాంగ్రెస్‌), భాజపా జాతీయ పార్టీలు. ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆ హోదా మీకు దఖలు పడలేదు. పొందిన ఓట్ల శాతం కారణంగా దక్కింది. ఆ రకంగా మేం కూడా జాతీయ పార్టీ హోదా పొందొచ్చుగదా’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని