మార్గదర్శి ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ ఉన్మాద చర్య

మార్గదర్శి సంస్థకు చెందిన రూ.794 కోట్లను సీఐడీ ఎటాచ్‌ చేయడం ఉన్మాద చర్య అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 31 May 2023 04:38 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మార్గదర్శి సంస్థకు చెందిన రూ.794 కోట్లను సీఐడీ ఎటాచ్‌ చేయడం ఉన్మాద చర్య అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా, సంస్థపై ఒక్క ఫిర్యాదు లేకపోయినా మార్గదర్శి సంస్థపై దాడులు చేయడం దారుణమన్నారు. మార్గదర్శి సంస్థపై పెట్టిన కేసులు న్యాయస్థానం ఎదుట నిలబడవని.. చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులోనే ఆ కేసులు కొట్టివేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టులో కొట్టివేయడం ఖాయమన్నారు. చంద్రబాబుకు రక్షణ తొలగించాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తానని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి రక్షణ తొలగించాలని పేర్కొనడంపై తన అభ్యంతరాన్ని తెలియజేస్తూ ప్రధానికి లేఖ రాస్తానని రఘురామ చెప్పారు. వివేకా హత్య కేసులో రహస్య సాక్షి ప్రాణాలకు హాని ఉందని సీబీఐ చెబుతున్నందున నిందితునిగా ఉన్న అవినాష్‌రెడ్డికి బెయిల్‌ రావడం కష్టమేనన్నారు. బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వల్ల గత ఎన్నికల్లో తమ పార్టీకి 17 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి ఆయన ప్రచారం చేసే అవకాశం లేనందున ఆ ఓట్లు తమకు దక్కే అవకాశం లేదని రఘురామ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని