Nara Lokesh: ‘రహస్య సాక్షి’తో సీఎం జగన్‌కు వణుకు
‘వివేకా హత్య కేసులో సీబీఐ.. సీఎం జగన్ అండ్ కో బండారం బయటపెట్టింది. రహస్య సాక్షి అని సీబీఐ ప్రస్తావించడంతో జగన్ వణికిపోయి దిల్లీకి పరుగులు తీశారు.
దిల్లీ వెళ్లి పెద్దల కాళ్లు పట్టుకున్నారు
తెదేపా ‘భవిష్యత్తుకు భరోసా’తో ప్రజల్లో సంతోషం
జమ్మలమడుగు సభలో నారా లోకేశ్
ఈనాడు డిజిటల్, కడప: ‘వివేకా హత్య కేసులో సీబీఐ.. సీఎం జగన్ అండ్ కో బండారం బయటపెట్టింది. రహస్య సాక్షి అని సీబీఐ ప్రస్తావించడంతో జగన్ వణికిపోయి దిల్లీకి పరుగులు తీశారు. బాబాయ్ హత్య కేసులో అరెస్టు కాకుండా దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు. ఎన్ని కాళ్లు పట్టుకున్నా బాబాయ్ ఆత్మ ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం 111వ రోజు వైయస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు శివారు నుంచి నడక ప్రారంభించారు. పట్టణ నడిబొడ్డున జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘యువగళంలో నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా. మీరు పడుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకుని ఆయన మహానాడులో ‘భవిష్యత్తుకు భరోసా’ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. దీంతో వైకాపా నేతల్లో వణుకు మొదలైంది.
పూర్తిస్థాయి ఎన్నికల ప్రణాళిక వస్తే వారి దుకాణం బంద్ అవుతుంది. ఈ హామీలు ఎలా అమలు చేస్తారని వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అప్పుల అప్పారావు అయితే చంద్రన్న సంపద సృష్టికర్త’ అని లోకేశ్ పేర్కొన్నారు. ‘రూ.కోట్లు వెచ్చించి జగన్‌ను గెలిపించుకున్న రెడ్డి సోదరులు ఆలోచించాలి. మీకు వైకాపాలో కనీస గౌరవం దక్కుతోందా? అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బందుల పాలుచేశారు. తెదేపాలో రెడ్డి సామాజికవర్గానికి అనాదిగా పెద్ద పీట వేస్తున్నాం’ అని గుర్తు చేశారు. ‘జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చివరకు చికెన్ షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర సైతం కప్పం కట్టించుకుంటున్నారు. ఆయన దెబ్బకు పరిశ్రమలు రాకుండా వెళ్లిపోయాయి. వివేకా హత్య కేసు నిందితులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు డబ్బులు సమకూర్చారనే అభియోగాలున్నాయి’ అని ఆరోపించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు.
సభకు పోటెత్తిన జనం
జమ్మలమడుగులో లోకేశ్ సభకు జనం పోటెత్తారు. దీంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. పట్టణంలో వీధి దీపాలు వెలగకుండా విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో చీకట్లోనే ఆయన పాదయాత్ర చేశారు. ప్రజలు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి వెంట నడిచారు.
జ్వరంతో బాధపడుతున్న లోకేశ్
మహానాడు వేదికపై వర్షానికి తడిసిన లోకేశ్ రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా అంగీకరించలేదు. ముందుగా ప్రకటించిన మేరకే మంగళవారం నుంచి పాదయాత్ర పునఃప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.