4 ఏళ్ల మోసకారి పాలనలో.. నేరాలు, విధ్వంసాలు, లూటీలే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి.. వివేకా హత్య విషయం ముందే తెలుసని సీబీఐ చెప్పాక కూడా, ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడం అర్థరహితమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Updated : 31 May 2023 07:39 IST

జగన్‌ ఖజానా కళకళ.. జనం బతుకులు వెలవెల
ధ్వజమెత్తిన తెదేపా నేతలు
వైకాపా పాలనపై తెదేపా ఛార్జిషీట్‌ విడుదల

ఈనాడు - అమరావతి:  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి.. వివేకా హత్య విషయం ముందే తెలుసని సీబీఐ చెప్పాక కూడా, ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడం అర్థరహితమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ వచ్చి ఎప్పుడు తనను, భారతీరెడ్డిని ప్రశ్నిస్తుందో అనే అభద్రతాభావంలో జగన్‌ ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి 2019 మార్చి 15న ఆయన చేసిన కార్యక్రమమే.. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునే పరిస్థితికి కారణం’ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్‌ను పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, పంచుమర్తి అనురాధ, జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ విడుదల చేశారు.

’మోసకారి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రైతులు దివాలా తీశారు. యువత నైరాశ్యంలో మునిగిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ కరవైంది. సంక్షేమ పథకాలను సంక్షోభంలోకి నెట్టారు. మౌలిక వసతుల రంగం కుదేలైంది. పాలన అంతా నేరాలు, ఘోరాలు.. లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలతో నిండిపోయింది’ అని వారు ధ్వజమెత్తారు.


అబద్ధాల పుట్ట

* 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక.. అవినీతి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ నిందలేసి.. అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. దీనిపై ఎలాంటి రుజువులు చూపకపోవడంతో హైకోర్టు కొట్టేసింది.

* అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారు. తర్వాత మూడు రాజధానులంటూ.. రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు.

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు సహా తెదేపా నేతల ప్రమేయం ఉందని, కేసు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ డిమాండు చేశారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దంటూ ఆయనే పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు.

* ఏడాదికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. నాలుగేళ్లలో నిర్మించింది అయిదు ఇళ్లేనని (పీఎంఏవై రూరల్‌) కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి సభలో చెప్పారు.

* నిర్మించని రింగ్‌రోడ్డులో లింగమనేని రమేశ్‌, నారాయణ కుటుంబీలకు అయాచిత లబ్ధి చేశారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.


మాట తప్పి, మడమ తిప్పిన జగన్‌రెడ్డి

* మద్యనిషేధం

* వారంలో సీపీఎస్‌ రద్దు

* ఇద్దరు పిల్లలకూ అమ్మఒడి

* 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ

* మెగా డీఎస్సీ

* అమరావతి రాజధాని

* మూడేళ్లలో కడప స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి

* డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రూ.10 లక్షలకు పెంపు

* రైతు భరోసా రూ.12,500 ఇస్తామని రూ.7,500కి కుదింపు

* కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడం


ఛార్జిషీట్‌లోని ప్రధానాంశాలివీ..

నేరాలు, ఘోరాలు

జగన్‌ అనుమతి లేకుండా.. ఎవరో వచ్చి ఆయన చిన్నాన్నను హత్య చేయడం సాధ్యమా?
70 ఏళ్ల వయసు పైబడి, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్‌ వివేకానందరెడ్డిని రాత్రి ఒంటి గంట, రెండు గంటల మధ్య పిడిగుద్దులు గుద్ది, గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేయించారు. జగన్‌రెడ్డి అనుమతి లేకుండా.. ఆయన చిన్నాన్నను ఎవరో వచ్చి హత్య చేయడం సాధ్యమవుతుందా? వివేకా హత్య బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్‌రెడ్డికి తెలుసని సీబీఐ.. కోర్టులో అఫిడవిట్‌ వేసింది. హత్య జరిగాక తెల్లవారుజామునే అవినాష్‌రెడ్డి.. జగన్‌, భారతిలతో వారి పీఏల ఫోన్ల ద్వారా మాట్లాడినట్లు రుజువైంది. ఆ సమయంలో హత్య గురించి కాకుంటే మరి దేనిపై మాట్లాడతారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని నమోదు చేయాలంటూ సీఐని అవినాష్‌రెడ్డి బెదిరించినట్లు రుజువైంది. అయినా అసెంబ్లీలోనే అవినాష్‌రెడ్డికి సీఎం క్లీన్‌చిట్‌ ఇవ్వడం.. ఆయన్ను సమర్థించడం కాదా? తనతోపాటు భార్య పాత్రను కప్పిపెట్టడానికేనా? వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి.. విచారణకు సహకరించాలి.


లూటీల పాలన

* నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్ల అప్పు తెచ్చి అందులో రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు. మిగిలిన రూ.4 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఇవి కాకుండా పెంచిన పన్నులు, ధరలు, ఛార్జీల ద్వారా వచ్చిన నిధులు ఎటు పోయాయి?

* జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఒక్కో కుటుంబంపై.. పెరిగిన ధరలతో రూ.2,40,000, పెంచిన పన్నులతో రూ.1,52,413, అప్పుల రూపంలో రూ.3,94,000 కలిపి.. మొత్తం రూ.7,86,413 భారం మోపారు.

* నాలుగేళ్లలో (2019-23) జగన్‌రెడ్డి కుటుంబం మొత్తం రూ.2,27,500 కోట్లు లూటీ చేసింది. 2004-09 మధ్య సీబీఐ గుర్తించిన ఆస్తులు రూ.43 వేల కోట్లు, గుర్తించనివి రూ.60 వేల కోట్లు మొత్తం కలిపితే రూ.3,30,500 కోట్లు దోచేశారు. ఇది లూటీ కాక మరేంటి?


విధ్వంసాల మయం

* జగన్‌రెడ్డి తన విధ్వంసక పాలనతో రూ.2 లక్షల కోట్ల విలువైన అమరావతిని నిర్వీర్యం చేశారు. 26 జిల్లాల జీవనాడైన పోలవరాన్ని అటకెక్కించారు. 3 వేల మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్‌, కిడ్నాప్‌, ఆస్తుల ధ్వంసం, బలవంతపు ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై 2 వేలకు పైగా దాడులకు పాల్పడ్డారు.

* ప్రభుత్వ అడ్డగోలు, అప్రజాస్వామిక నిర్ణయాల్ని అసంబద్ధ ఉత్తర్వుల్ని రద్దు చేశారనే అక్కసుతో న్యాయవ్యవస్థపైనే దాడికి దిగారు.

* పోలీస్‌ వ్యవస్థను ప్రైవేటు సైన్యంలా మార్చుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారు.

*  భూముల దోపిడీ కోసం ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు.


విద్వేషాల అడుగులు

* కుల, మత, ప్రాంత, పార్టీల పేరుతో విద్వేష రాజకీయాలు చేస్తూ 6 లక్షల మందికి పింఛన్లు తొలగించారు. రైతు భరోసాకు కులాలు ఆపాదించారు.

* సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తెదేపా సామాజిక మాధ్యమ కార్యర్తలపై సీఐడీ పోలీసులు 150కి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు.

* నాలుగేళ్లలో 73 మంది తెదేపా కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేల మంది నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీలపై ఎట్రాసిటీ కేసులు పెట్టి ఆ చట్టాన్ని నీరుగార్చుతున్నారు.

* తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర, జర్నలిస్టులు కోగంటి శ్రీనివాసులు, కొల్లా అంకబాబు, రమ్య దాసరి, పరుచూరి కోటి తదితరుల్ని అక్రమంగా అరెస్టు చేశారు. 60 ఏళ్ల వయసున్న రంగనాయకమ్మపై అక్రమ కేసు బనాయించారు.

* ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అరాచకాల్ని మీడియాలో బయటపెట్టారని తెదేపా కార్యకర్త, చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని