2న అన్ని జిల్లాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు: చిన్నారెడ్డి

తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది.

Updated : 01 Jun 2023 05:31 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది. జూన్‌ 2 నుంచి 20 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం చిన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జూన్‌ 2న హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడంతో పాటు జిల్లాల్లో ఉద్యమకారులను సన్మానిస్తామన్నారు. 2న ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులు.. గాంధీభవన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని వివరించారు. అనంతరం గాంధీభవన్‌లో సభ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 3వ తేదీ నుంచి నిర్వహించే కార్యక్రమాల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు. కమిటీ సమావేశానికి ప్రతినిధులు జి.నిరంజన్‌, శ్యాంమోహన్‌, చెరుకు సుధాకర్‌, అద్దంకి దయాకర్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రోహిన్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, మానవతారాయ్‌, రియాజ్‌, వినోద్‌కుమార్‌, రవి, జ్ఞానసుందర్‌, మెట్టు సాయికుమార్‌, పాండురంగారెడ్డి హాజరయ్యారు.

సోనియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి: వీహెచ్‌

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి జూన్‌ 2న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలంగాణ ప్రజలందరూ పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను ఆయన బుధవారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. 2వ తేదీన కాంగ్రెస్‌ శ్రేణులు సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని