పరస్పరం దాడులు, పిడిగుద్దులు.. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు బహిరంగంగా దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

Updated : 01 Jun 2023 05:29 IST

పోచమ్మమైదాన్‌ (వరంగల్‌), న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు బహిరంగంగా దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఎంపికైన తర్వాత వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదానంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కార్యకర్తలు కొట్టుకోవడంతో గ్రామాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు భయాందోళనకు గురయ్యాయి. గాడిపెల్లి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు కట్టస్వామి తమను కులం పేరుతో దూషించినట్లు ఆరోపిస్తూ పరకాల నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అనుచరులు, ఎస్సీ సెల్‌ నాయకులైన ధర్మారం గ్రామానికి చెందిన దూపాకి సంతోష్‌, జన్ను రాజు, ఏకుల రాజు, గాదె ప్రవీణ్‌, ఇతరులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. పిడిగుద్దుల దాడిని తట్టుకోలేక కట్టస్వామి స్టేజి మీదకు వెళ్లినప్పటికీ తిరిగి కిందికి లాక్కొచ్చి జిల్లా నాయకుల సమక్షంలోనే మరోసారి దాడి చేశారు. ఆర్థికపరమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని తనపై దాడికి దిగారని బాధితుడు కట్టస్వామి ఆరోపించారు. దాడికి పాల్పడిన వారి అంతుచూస్తానని ఎర్రబెల్లి స్వర్ణ భర్త వరద రాజేశ్వర్‌రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇరువర్గాలు శాంతించిన తర్వాత సమావేశం సజావుగా సాగింది. ఈ ఘటనపై పరకాల నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అనుచరులు స్థానిక ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని