ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు భారాస, కాంగ్రెస్‌ కలిసి కుట్ర

రాష్ట్రంలో భాజపా బలపడితే తమకు నష్టమని భావించి భారాస, కాంగ్రెస్‌ కలిసి కుట్ర పన్నుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 01 Jun 2023 04:16 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో భాజపా బలపడితే తమకు నష్టమని భావించి భారాస, కాంగ్రెస్‌ కలిసి కుట్ర పన్నుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలేలా ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. కాంగ్రెస్‌ బలంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకుల చేరికతోనే భాజపా అధికారంలోకి వస్తుందని అనుకోవద్దని.. రాష్ట్రంలోని అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. భాజపాలో చేరిన నాయకులు పార్టీలోనే ఉన్నారని, పార్టీ కోసమే పోరాడుతున్నారని చెప్పారు. ఇంకా అనేకమంది చేరబోతున్నారని తెలిపారు. ఒక్క కర్ణాటక ఓటమితో తాము డీలాపడబోమన్నారు.
కాకినాడ తీర్మానం మొదలు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు భాజపా పోరాడిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఒక్క కుటుంబంతోనే తెలంగాణ ఏర్పడలేదన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి పార్లమెంట్‌లో 168 మంది భాజపా ఎంపీలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలు, కులాలు, ప్రజాసంఘాల పోరాటం, మానవహారం, మిలియన్‌ మార్చ్‌, వంటావార్పులు, రైల్‌రోకోలు, సకల జనుల సమ్మెల్లో భాజపా నాయకులు, కార్యకర్తలు మమేకమయ్యారని వివరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. జూన్‌ 2న ఉదయం ఏడు గంటలకు గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయడంతో పాటు సాయుధ బలగాల కవాతు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం శంకర్‌ మహదేవన్‌, డాక్టర్‌ ఆనంద్‌ శంకర్‌ బృందం, మంజులా రామస్వామి, మంగ్లీ, మధుప్రియల ప్రదర్శనలు, పాటలు ఉంటాయని వివరించారు.  

లోక్‌సభ స్థానాల పునర్విభజన రాజ్యాంగ ప్రక్రియ

లోక్‌సభ స్థానాల పునర్విభజన రాజ్యాంగ ప్రక్రియ అని కిషన్‌రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఉత్తరాది-దక్షిణాది అంటూ మాట్లాడడం సరికాదని.. దక్షిణాది నుంచి ప్రధానమంత్రులు అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

*  పార్లమెంటు నూతన భవనంలో ఇటీవల ప్రతిష్ఠించిన సెంగోల్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన తిరువడుత్తురై పీఠాధిపతి శ్రీఅంబలవాన పండారా సన్నిధిస్వామి కిషన్‌రెడ్డిని బుధవారం కలిశారు. మఠం ఆధీనంలో కొనసాగుతున్న కార్యక్రమాలు, శ్రీమయూరనాథ దేవాలయ విశిష్టత, పీఠం ఆధీనంలోని ఆలయాలు, తాళపత్ర గ్రంథాల నిధి తదితర అంశాలపై వారు చర్చించారు. తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ, పీఠం సమీపంలో పర్యాటక రంగం అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ఆయన వినతిపత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని