దేవుడి కంటే ఎక్కువ తెలుసని మోదీ అనుకుంటారు

దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని భారత్‌లో కొంతమంది భావిస్తుంటారని, అలాంటి ఓ ప్రత్యేక మనిషిగా ప్రధాని మోదీ నిలుస్తారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.

Published : 01 Jun 2023 04:16 IST

ఆయనో ప్రత్యేక మనిషి
అమెరికాలో రాహుల్‌గాంధీ విమర్శలు

శాంతాక్లారా (అమెరికా), దిల్లీ: దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని భారత్‌లో కొంతమంది భావిస్తుంటారని, అలాంటి ఓ ప్రత్యేక మనిషిగా ప్రధాని మోదీ నిలుస్తారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ యూఎస్‌ఏ’ మంగళవారం నిర్వహించిన ‘మొహబ్బత్‌ కీ దుకాణ్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘..వారికి అన్నీ తెలుసు. చరిత్రకారులకే వారు చరిత్ర చెప్పగలరు! శాస్త్రవేత్తలకు సైన్స్‌ నేర్పగలరు! యుద్ధం ఎలా చేయాలో సైన్యానికి బోధించగలరు!! ఏదీ వినిపించుకునేందుకు వారు సుముఖంగా ఉండరు. ఎంతో విశాలమైన ప్రపంచంలో అన్నీ తెలుసుకోవడం ఏ వ్యక్తికైనా కష్టం. భారత్‌లో మాత్రం కొందరు దీనికి అతీతం. వారు దేవుడితో కలిసి కూర్చొని ఏం జరుగుతోందో చెబుతారు. మోదీ అలాంటివారే. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందని దేవుడికే ఆయన చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు’ అని రాహుల్‌ అన్నప్పుడు పెద్దపెట్టున నవ్వులు విరిశాయి.

సమస్యల్ని పరిష్కరించలేక హడావుడి

నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేక కొత్త పార్లమెంటు భవనం పేరుతో హడావుడి చేస్తోందని రాహుల్‌ విమర్శించారు. పార్లమెంటులో సెంగోల్‌కు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేయడాన్ని ప్రస్తావిస్తూ తాను అలా సాగిలపడనందుకు మీరంతా ఆనందంగా లేరా అని సభికులను ప్రశ్నించారు.   

ఖలిస్థాన్‌ అనుకూలుర కలకలం

సభకు అంతరాయం కలిగించేందుకు ఖలిస్థాన్‌ మద్దతుదారులు కొంతమంది ప్రయత్నించినా, భద్రత సిబ్బంది దానిని వమ్ము చేశారు. నినాదాలతో కొద్దిసేపు రాహుల్‌ తన ప్రసంగం నిలిపేయాల్సి వచ్చింది. ఎవరు ఏం చెప్పాలనుకున్నా ఆగ్రహించకుండా వినడం కాంగ్రెస్‌ ప్రత్యేకత అని, ఆందోళనకారులనూ తాను ఆహ్వానిస్తున్నానని ఆయనన్నారు. ‘‘ప్రతిపక్షాలన్నీ ఏకమైతే భాజపా కచ్చితంగా ఓడిపోతుంది. కర్ణాటక ఎన్నికలే అందుకు ఉదాహరణ. ప్రపంచ మీడియాలో చూపిస్తున్న పరిస్థితులు భారత్‌లో లేవు. అదంతా రాజకీయ ప్రచారమే’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. భారత్‌ను నడపడానికి రాహుల్‌వంటి యువనేత అవసరమని ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శాం పిట్రోడా చెప్పారు.


ఆయన నకిలీ గాంధీ: ప్రహ్లాద్‌ జోషి

రాహుల్‌ ఓ నకిలీ గాంధీ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. ఆయనకు ఏమీ తెలియకపోయినా అన్నింట్లో నిష్ణాతుడేనని ఎద్దేవా చేశారు. రాహుల్‌కు సొంత కుటుంబం గురించి తప్పిస్తే చరిత్ర ఏమీ తెలియదని దిల్లీలో విమర్శించారు. ‘బంగాళాదుంపల నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేస్తారని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఉపన్యాసాలిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు దాటి బయటకు రానివ్యక్తి దేశాన్ని నడిపేయాలనుకుంటున్నారు’ అని చెప్పారు. మోదీని ప్రపంచ దేశాలు ‘బాస్‌’ అంటే.. రాహుల్‌ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మండిపడ్డారు. విదేశాల్లో అడుగుపెట్టగానే రాహుల్‌లో జిన్నా ఆత్మ చేరుతుందని భాజపా సీనియర్‌ నేత ముఖ్తార్‌ అబ్బాస్‌నక్వీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని