వైకాపా అంటే వడ్డన!

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు పెంచిన భూముల మార్కెట్‌ విలువలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి.

Published : 01 Jun 2023 04:38 IST

భూముల మార్కెట్‌ రేట్ల పెంపు నేటి నుంచి అమల్లోకి
సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని 20% గ్రామాల్లో

ఈనాడు, అమరావతి: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు పెంచిన భూముల మార్కెట్‌ విలువలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వైకాపా హయాంలో రిజిస్ట్రేషన్‌ శాఖ పరంగా ఆరుసార్లు రకరకాల రుసుములు పెరిగాయి. తాజాగా సామాన్యుల ఆస్తుల కొనుగోలు ఆశలను నీరుగారుస్తూ ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి భూముల మార్కెట్‌ విలువలను 30% నుంచి 75% వరకు ప్రభుత్వం పెంచింది. మార్కెట్‌ విలువలతో పాటే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు పెరుగుతాయి. ఖజానాకు అదనంగా నిధులు సమకూరతాయి. భూముల విలువల పెంపును అమలుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

ఏ మార్గాన్నీ వదల్లేదు: భూముల విలువలు పెంచేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ప్రభుత్వం అన్వేషించింది. వ్యవసాయ, వ్యవసాయేతరగా భూములు ఎక్కడ మారుతున్నాయి? లే అవుట్లు ఎక్కడెక్కడ వేశారు? ఎక్కడెక్కడ కొత్తగా లేఅవుట్లు రాబోతున్నాయన్న వివరాల్ని సేకరించి మరీ భూముల విలువలను సవరించారు. ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో 50 గ్రామాలుంటే దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసిన 20% గ్రామాల్లో భూముల మార్కెట్‌ విలువలను పెంచారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు వడ్డన జరిగింది. సాధారణంగా ప్రతి ఏడాదీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి అర్బన్‌ ప్రాంతాల్లో, రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్‌ విలువలను సవరిస్తారు. ప్రతి ఏడాదీ స్ట్రక్చర్స్‌ మార్కెట్‌ విలువలను సవరించడం ఆనవాయితీ. 2020లో చివరిగా మార్కెట్‌ విలువలను సవరించారు. గత ఏడాది ఫిబ్రవరి ఒకటిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువల(జిల్లాల విభజన జరగకముందే)ను పెంచారు. అదే ఏడాది ఏప్రిల్‌లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను... జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలోని ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ప్రాతిపదికగా మార్కెట్‌ విలువలను 13% నుంచి 75% వరకు పెంచారు. కిందటేడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాల వరకు అన్ని రకాల మార్కెట్‌ విలువలను వడ్డించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి యూజర్‌ ఛార్జీలను, మళ్లీ ఇప్పుడు భూముల మార్కెట్‌ విలువలను పెంచింది.


పెంపు తీరిలా...

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అనగుంట గ్రామంలో వ్యవసాయ భూమి ఎకరా మార్కెట్‌ విలువ రూ.13 లక్షలు ఉంటే.. రూ.15 లక్షలు చేశారు. కుర్రకాలువ పరిధిలోని మార్కెట్‌ విలువను రూ.25 లక్షల నుంచి రూ.32 లక్షలకు, ఎర్రంరెడ్డిపాలెంలో రూ.39 లక్షల నుంచి రూ.45 లక్షలకు పెంచారు. తిరుపతి గ్రామీణ మండలం కాయంగ్రామంలో రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షలకు చేశారు.

* విశాఖ నగరంలోని సీతమ్మధారలో చదరపు గజం విలువ రూ.64 వేల నుంచి రూ.68 వేలకు పెంచారు. మధురవాడలో రూ.24 వేలు ఉంటే... రూ.40 వేలు చేశారు. పెందుర్తి పరిధిలో చిన్నముషిడివాడలో చదరపు అడుగు రూ.2,500కు రూ.3,000కు పెంచారు.

* కాకినాడ నగరంలోని రామారావుపేట ప్రాంతంలో గజం మార్కెట్‌ విలువ రూ.23 వేలు ఉంది. దీనిని రూ.29,900కు పెంచారు. నూకాలమ్మ ఆలయ వీధిలో గజం ప్రస్తుతం రూ.23 వేలు ఉంటే.. రూ.35,800(56%)గా ఖరారుచేశారు. వాణిజ్య ప్రాంతంలో ప్రస్తుత గజం మార్కెట్‌ విలువ రూ.34 వేలు ఉంటే... దానిని రూ.57,800(70%) చేశారు.  

* నెల్లూరు జిల్లా కొండేపిలో గజం మార్కెట్‌ విలువ రూ.880 ఉంటే... దానిని రూ.1,500 అయింది. ఒంగోలులోని గోపాలనగరంలో ఇంటి స్థలం గజం మార్కెట్‌ విలువ రూ.14 వేలు ఉంటే రూ.19 వేలు చేశారు. కొప్పోలులో ఎకరా పొలం మార్కెట్‌ విలువ రూ.20 లక్షలు ఉంటే రూ.25 లక్షలు చేశారు. ఇలా పెంపు దాదాపుగా ప్రతి జిల్లాలో జరిగింది. మార్కెట్‌ విలువల పెంపునకు తగ్గట్లుగానే జిల్లాలకు భారీగా ఆదాయ లక్ష్యాలను నిర్దేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని