బందరులో ఉద్రిక్తత
మచిలీపట్నంలో ఏకపక్షంగా ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదమవుతోంది. పోలీసు అధికారులే స్వయంగా బుధవారం తెదేపా ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది.
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మచిలీపట్నంలో ఏకపక్షంగా ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదమవుతోంది. పోలీసు అధికారులే స్వయంగా బుధవారం తెదేపా ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగు రోజుల క్రితం కోనేరు సెంటరులో వైకాపా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ముట్టుకోకుండా తమది మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారంటూ తెదేపా శ్రేణులు ప్రశ్నించినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు. వాగ్వాదమేర్పడి పోలీసులు, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని పెడన స్టేషన్‌కు తరలించారు. ‘బాబాయి గొడ్డలికి.. బంగారు భవిష్యత్తుకు యుద్ధం’ అంటూ బుధవారం స్థానిక బస్టాండు, కోనేరు సెంటర్లలో తెదేపా ఆధ్వర్యాన ఫ్లెక్సీల ఏర్పాటుకు సిద్ధమవుతుండగా.. చిలకలపూడి పోలీసులు వచ్చి ఫ్లెక్సీని చించివేయడమే కాకుండా అక్కడున్న పార్టీ ప్రచార కార్యదర్శి ఫణికుమార్‌ను తమ స్టేషన్‌కు తరలించారు. కోనేరు సెంటరులోనూ ఫ్లెక్సీని తొలగించేందుకు ఆర్‌పేట పోలీసులు సిద్ధమవగా ప్రతిఘటించిన తెదేపా నాయకులను పెడన స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనలు కాసేపు ఉద్రిక్తతకు దారితీశాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫ్లెక్సీల చించివేతపై సెల్‌ఫోన్‌లో ఆర్‌పేట సీఐ రవికుమార్‌తో మాట్లాడారు. వైకాపా వాటికి అనుమతులున్నాయని, కార్పొరేషన్ అధికారులు అడిగిన మీదటే తెదేపా ఫ్లెక్సీలు తొలగించామని సీఐ ఆయనకు సమాధానమిచ్చారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయం వద్దకు రవీంద్ర చేరుకుని వారినీ నిలదీశారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, ఎవరివీ తొలగించాలని కోరలేదని చెప్పడంతో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో పోలీసు అధికారుల అత్యుత్సాహం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.