చంద్రబాబుకు జన అభివాదం

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభివాదం చేశారు.

Published : 01 Jun 2023 04:52 IST

విశాఖలో వివాహ కార్యక్రమాలకు హాజరు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభివాదం చేశారు. రెండు జిల్లాల్లో మూడుచోట్ల జరిగిన వివాహ వేడుకలకు చంద్రబాబు హాజరవగా అన్నిచోట్లా ప్రజలు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రజల ఉత్సాహాన్ని గుర్తించిన చంద్రబాబు... వారికి విజయసూచిక చూపిస్తూ అభివాదం చేశారు. బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రబాబు అచ్యుతాపురం వెళ్తుండగా పరవాడ కూడలి వద్ద పెద్దసంఖ్యలో ఉన్న తెదేపా కార్యకర్తలు, అభిమానులను చూసిన ఆయన వాహనం బయటకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం అచ్యుతాపురం వద్ద కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన వివాహానికి హాజరవగా... చంద్రబాబు వస్తారని ముందే తెలిసి ఎక్కువమంది వచ్చారు. వివాహ వేదిక వద్దకు చేరుకున్న ఆయన ముందుకొచ్చి అందరికీ నమస్కరించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి తిరిగి వెళ్తుండగా అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో పలువురు నెట్టుకోవడంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆయన్ను కాన్వాయ్‌ వద్దకు తీసుకువెళ్లడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. తర్వాత ఎంజీఎం పార్క్‌ వద్ద జరిగిన మరో వివాహ వేడుకలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విజయవాడకు తిరుగుపయనం అయ్యారు. ఇటీవల మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోకు వచ్చిన స్పందనపై నేతలను ఆరా తీసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని