సంక్షిప్త వార్తలు(5)

విదేశీ పర్యటనల్లో మన దేశంపైనా, ప్రధానిపైనా వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్‌గాంధీ ఓ విదూషకుడని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ విమర్శించారు.

Updated : 02 Jun 2023 05:48 IST

రాహుల్‌ ఓ విదూషకుడు.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌

ఆణంద్‌ (గుజరాత్‌): విదేశీ పర్యటనల్లో మన దేశంపైనా, ప్రధానిపైనా వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్‌గాంధీ ఓ విదూషకుడని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ విమర్శించారు. ప్రధాని వ్యక్తిత్వానికి ఆయన ఏమాత్రం సరితూగరని చెప్పారు. రాహుల్‌ది గాలియాత్ర అంటూ ఎద్దేవా చేశారు.


ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగాలి: కాసాని

ఈనాడు, హైదరాబాద్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన జరగాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ప్రజాస్వామ్య విలువలు పతనం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరుల ఆకాంక్షలు ఫలించేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కాసాని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.


అధికారంలో ఉన్నవారికే దశాబ్ది సంబరాలు: పోటు రంగారావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది సంబరాలు అధికారంలో ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. రాష్ట్రం కోసం పోరాడిన ప్రజల ఆశలు, ఆకాంక్షల మాటేంటని ప్రశ్నించారు. ‘నిరసనలకు అవకాశమివ్వట్లేదు. రైతులకు రుణమాఫీ చేయట్లేదు. కౌలు రైతులను పట్టించుకోవట్లేదు’ అంటూ గురువారం విమర్శలు గుప్పించారు.


టైపిస్టు సైతం లేకపోవడం దయనీయం: వర్ల రామయ్య

ఈనాడు, అమరావతి: కర్నూలులో ఏర్పాటు చేసిన మానవ హక్కుల కమిషన్‌కు కనీసం టైపిస్టుని కూడా నియమించలేదని.. కమిషన్‌ ఆదేశాలను ఛైర్‌పర్సనే టైప్‌ చేసుకోవడం ప్రభుత్వ సంస్థల దయనీయ దుస్థితికి అద్దం పడుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు గురువారం లేఖ రాశారు. కమిషన్‌కు సిబ్బంది, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


శిందేతో శరద్‌ పవార్‌ భేటీ

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ముంబయిలో గురువారం భేటీ అయ్యారు. మరాఠా మందిర్‌ అనే దాతృత్వ సంస్థ 75వ వార్షికోత్సవానికి సీఎంను ఆయన ఆహ్వానించారు. మరాఠా మందిర్‌ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం పవార్‌ దాని అధ్యక్షుడిగా ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని