ఇలాంటి సస్పెన్షన్‌ను ఊహించలేకపోయా

లోక్‌సభలో తనపై అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని రాజకీయాల్లో చేరినప్పుడు ఊహించలేకపోయానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 04:57 IST

స్టాన్‌ఫోర్డ్‌ విద్యార్థులతో సమావేశంలో రాహుల్‌గాంధీ

స్టాన్‌ఫోర్డ్‌ (కాలిఫోర్నియా): లోక్‌సభలో తనపై అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని రాజకీయాల్లో చేరినప్పుడు ఊహించలేకపోయానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో, భారత సంతతి విద్యావేత్తలతో ముచ్చటించారు. కిక్కిరిసిన ఆడిటోరియంలో వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మోదీ అనే ఇంటిపేరున్నవారికి సంబంధించి చేసిన వ్యాఖ్యపై శిక్ష నేపథ్యంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ‘2000 సంవత్సరంలో రాజకీయాల్లో నేను అడుగుపెట్టినప్పుడు ఇప్పటి పరిణామాలను ఏమాత్రం ఊహించలేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే భావించలేదు. తర్వాత మాత్రం- ప్రజలకు సేవ చేసేందుకు నాకిదో మహత్తర అవకాశమని భావించాను. నాకు రావాల్సినదానికంటే పెద్ద అవకాశమే ఇది. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి’ అని రాహుల్‌ చెప్పారు.

పోరాటంపై స్పష్టత ఉంది

‘ఇప్పుడు భారత్‌లో విపక్షమంతా సంఘర్షణ పడుతోంది. ఈ కథ కొన్నినెలల క్రితం మొదలైంది. అప్పట్లో ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి. ఆర్థికవనరుల పరంగా అధికారపక్ష ఆధిపత్యం, వ్యవస్థలపై పెత్తనం నడుస్తున్నాయి. మా దేశంలోనే మేం ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం. పోరాటంపై నాకు చాలాస్పష్టత ఉంది’ అని రాహుల్‌గాంధీ వివరించారు. భారత్‌- చైనా సంబంధాలు కఠినంగా ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యాపై తటస్థ వైఖరి సబబేనని సమర్థించారు. దేశ ప్రయోజనాలనూ చూసుకోవాలని అన్నారు.

హలో మోదీ.. నా ఫోన్‌ ట్యాప్‌ చేశారని తెలుసు

తన ఐఫోన్‌ను ట్యాప్‌ చేసిన విషయం తెలుసని రాహుల్‌గాంధీ చెప్పారు. సరదాగా తన ఫోన్‌వైపు చూస్తూ ‘హలో.. మోదీ’ అని పలకరించారు. సిలికాన్‌ వ్యాలీలోని అంకుర పారిశ్రామికవేత్తలతో వివిధ రకాల సాంకేతికతలు, ఏఐ, డ్రోన్లు వంటివాటి గురించి ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో డ్రోన్‌ వంటి టెక్నాలజీలు అధికారిక నిబంధనల అడ్డంకిని ఎదుర్కొంటాయి. పెగాసస్‌ వంటి టెక్నాలజీలకు నేను భయపడను. డేటా ప్రైవసీకి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మీ ఫోన్‌ను ట్యాప్‌ చేయాలని నిర్ణయిస్తే ఎవరూ ఆపలేరు’ అని వ్యాఖ్యానించారు. అమెరికాతో కేవలం ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలే సరిపోవనీ.. డేటా, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాల్లోనూ భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.  ఐటీ రంగంపై రాహుల్‌కు ఉన్న లోతైన అవగాహన అబ్బురపరిచిందని ‘ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌’ సీఈవో సయీద్‌ అమిది చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని